రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముం బై ఇండియన్స్‌ను మట్టికరిపించిన జోరులో రాజస్థాన్ రాయల్స్నూ భరతం పట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ రాయల్స్‌పై బెంగళూరు భారీ విజయాన్నందుకున్నది.
దుబాయ్: ఐపీఎల్లో ప్లేఆఫ్ సమీపిస్తున్న సమయంలో జట్ల మధ్య రసవత్తర సమరాలు జరుగుతున్నాయి. ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో విజయం కోసం జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన..ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళుతున్నది. మరోవైపు ఫైనల్-4లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ సత్తాచాటలేకపోయింది. వరుసగా మూడో ఓటమితో అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మ్యాచ్ విషయానికొస్తే రాజస్థాన్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 17 బంతులు మిగిలుండగానే మూడు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ఓపెనర్లు పడిక్కల్(25), కెప్టెన్ కోహ్లీ(22) మెరుగైన శుభారంభమివ్వగా వన్‌డౌన్‌లో వచ్చిన తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్(35 బంతుల్లో 44, 3ఫోర్లు, సిక్స్) వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. సమయోచిత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈ సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడిన భరత్..కోహ్లీ, మ్యాక్స్‌వెల్(30 బంతుల్లో 50 నాటౌట్, 6 ఫోర్లు, సిక్స్)తో కలిసి సాధికారికంగా ఆడాడు. రాయల్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చూడచక్కని షాట్లతో అలరించాడు. మోరిస్ బౌలింగ్‌లో భరత్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ వరుస బౌండరీలతో చెలరేగి ఆర్సీబీకి విజయాన్ని కట్టబెట్టాడు. తొలుత రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్లు లెవిస్(58), యశస్వి(31) రాణించినా..మిగతావారు అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 49 పరుగుల తేడాతో రాయల్స్ చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. హర్షల్ పటేల్(3/34), షాబాజ్(2/10) రాణించగా, చాహల్(2/18)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
రాజస్థాన్: 20 ఓవర్లలో 149/9(లెవిస్ 58, యశస్వి 31, హర్షల్ 3/34, చాహల్ 2/18, షాబాజ్ 2/10),
బెంగళూరు: 17.1 ఓవర్లలో 153/3(మ్యాక్స్‌వెల్ 50 నాటౌట్, శ్రీకర్ భరత్ 44, ముస్తాఫిజుర్ 2/20)