బెంగళూరు: ఐపీఎల్లో తొలి ట్రోఫీ గెలిచిన ఆనందంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా విజయోత్సవ వేడుకలకు పిలుపునిచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యమే చిన్నస్వామి తొక్కిసలాట ఘటనకు కారణమని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) అభిప్రాయపడింది. జూన్ 4న చిన్నస్వామి స్టేడియం ఆవల జరిగిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై క్యాట్ స్పందిస్తూ.. ‘ప్రాథమికంగా చూస్తే ఇంత భారీ స్థాయిలో అభిమానులు తరలిరావడానికి ఆర్సీబీ యాజమాన్యమే కారణం. ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాలో విక్టరీ పరేడ్ పోస్ట్ పెట్టిన 12 గంటల్లోపే అభిమానులు చిన్నస్వామికి పోటెత్తారు.
ఆర్సీబీ ముందుగా పోలీసుల నుంచి పరేడ్‌కు అవసరమైన అనుమతులు తీసుకోలేదు. 35 వేల సామర్థ్యం గల స్టేడియానికి సుమారు 2 నుంచి 3 లక్షల మంది దాకా తరలిరావడంతో పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. సమయాభావం వల్ల పోలీసులు సైతం అవసరమైన బలగాలను సమకూర్చుకోలేకపోయారు. పోలీసులేమీ దేవుళ్లు కాదు కదా.. వాళ్లూ మానవ మాత్రులే. భారీగా వచ్చిన జనాలను అదుపుచేయడానికి వారిదగ్గర అల్లావుద్దీన్ ద్వీపం వంటిదేమీ లేదు. పోలీసులు పూర్తి సన్నద్దం అయ్యేందుకు సమయం ఇచ్చుంటే బాగుండేది’ అని వెల్లడించింది. దీనిపై ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇంకా స్పందించలేదు.