Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (Joe Root) రికార్డులు పర్వం లిఖిస్తున్నాడు. స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో శతకాల మోత మోగిస్తున్న అతడు.. సిరీస్‌లో కీలకమైన ఓవల్ మైదానంలోనూ సెంచరీ బాదాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో డబుల్స్ తీసి.. భారత్‌పై పదమూడో వందతో చరిత్ర సృష్టించాడు రూట్. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక రన్స్ చేసిన మూడో ఆటగాడిగా రూట్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ ముందున్నాడు. ఈ దిగ్గజ ప్లేయర్ ఇంగ్లండ్‌పై ఏకంగా 19 సెంచరీలు కొట్టాడు. వెస్టిండీస్‌పై 13 శతకాలు సాధించిన భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
జట్టుకు అవసరమైన సమయంలో బ్యాటుతో బదులిచ్చే రూట్ ఓవల్‌లో వందతో అలరించాడు. భారత బౌలింగ్ దళాన్ని అసహనానికి గురి చేస్తూ టీ బ్రేక్ తర్వాత అతడు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడికిది 39వ శతకం. ఓవల్ టన్‌తో రూట్ శ్రీలంక వెటరన్ కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ప్రస్తుతం అత్యధిక శతక వీరుల జాబితాలో అతడు నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
The perfect tribute to Graham Thorpe by Joe Root ❤️
(via @englandcricket) #ENGvIND pic.twitter.com/rUnYDqUI4D
— ESPNcricinfo (@ESPNcricinfo) August 3, 2025
ఓవరాల్‌గా 51 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా.. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్(45) రెండో స్థానంలో,. ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(41) మూడో ప్లేస్‌లో ఉన్నారు. స్వదేశంలో బ్యాట్‌తో హడలెత్తించే రూట్ .. అత్యధికంగా 24 సార్లు మూడంకెల స్కోర్ అందుకోవడం విశేషం. పాంటింగ్, కలిస్, జయవర్దనేలు 23 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.