Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మైదానంలో ఒక రికార్డు బ్రేకర్. దేశం తరఫునే కాదు క్లబ్ జట్లకు చిరస్మరణీయ విజయాలు అందించిన ఘనుడు అతడు. అలాంటి లెజెండరీ ప్లేయర్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే సీజన్లో రియల్ మాడ్రిడ్ (Real Madrid)జెర్సీ వేసుకోబోతున్నాడంటూ తనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టాడు. మరో రెండేళ్లు తాను సౌదీ అరేబియా క్లబ్ అల్ నస్రీ(Al Nassr)కి ఆడబోతున్నానని వెల్లడించాడీ ఫార్వర్డ్ ప్లేయర్.
రెండున్నరేళ్ల కాంట్రాక్ట్‌తో ఈ క్లబ్లో చేరిన రొనాల్డో 2027 వరకూ కొనసాగనున్నాడు. ఈవిషయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు ఫుట్‌బాల్ స్టార్. ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కలిగిన రొనాల్డో ఏ వార్తనైనా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. అల్ నస్రీతో మరో రెండేళ్లు కొనసాగాలనుకుంటున్న ఈ ఫార్వర్డ్ ప్లేయర్ తన పోస్ట్‌లో ‘కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే అదే ప్యాషన్. ఒకటే లక్ష్యం. మరోసారి అందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం’ అని రాసుకొచ్చాడు.
A new chapter begins. Same passion, same dream. Let’s make history together. 🟡🔵 pic.twitter.com/JRwwjEcSZR
— Cristiano Ronaldo (@Cristiano) June 26, 2025
మూడేళ్ల క్రితం ఫిఫా వరల్డ్ కప్ తర్వాత రొనాల్డోను అల్ నస్రీ క్లబ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రెండున్నరేళ్ల కాలానికి రూ. 4400 కోట్ల కళ్లు చెదిరే సొమ్ముతో అతడితో ఒప్పందం చేసుకుంది. రొనాల్డో రాకతో పుంజుకున్న సౌదీ క్లబ్ అద్భుత విజయాలతో దూసుకుపోయింది. అయితే.. మే నెలలో సౌదీ ప్రో లీగ్ తర్వాత అధ్యాయం ముగిసింది అంటూ పోస్ట్ పెట్టాడు. దాంతో, అతడు రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు మారుతాడనే వార్తలు వినిపించాయి. కానీ, ఏమైందో తెలియదు మనసు మార్చుకున్న రొనాల్డో.. అల్ నస్రీతోనే 2027 వరకూ కొనసాగాలని డిసైడ్ అయ్యాడు.
ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన రొనాల్డోకు అభిమానగణం చాలానే. తన అద్భుత ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలు గెలిచిన అతడు ఈమధ్యే ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఏకంగా 600 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ చేరుకున్నాడు. అంటే.. అతడిని 60 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దాంతో, ఇన్‌స్టాలో అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు రొనాల్డో.