న్యూఢిల్లీ: రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ (Dinesh Lad)దీనిపై స్పందించారు. 2027లో వన్డే వరల్డ్‌కప్ గెలవడమే రోహిత్ శర్మ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే రోహిత్ నేతృత్వంలోని టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఇండియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన తర్వాతే రోహిత్ రిటైర్ అవుతారని లాడ్ తెలిపారు. 2027 వరల్డ్‌కప్ గెలవడమే రోహిత్ లక్ష్యమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ రోహిత్ టార్గెట్ అని, కానీ దురదృష్టవశాత్తు ఆ టోర్నీకి క్వాలిఫై కాలేదన్నారు. ఇక ఇప్పుడు 2027 వరల్డ్‌కప్ లక్ష్యంగా మారిందని, ఆ వరల్డ్‌కప్ ఆడిన తర్వాతే అతను రిటైర్ కావాలని ఆశిస్తున్నట్లు దినేశ్ లాడ్ తెలిపారు.
2027 వన్డే వరల్డ్‌కప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా నిర్వహించనున్నారు. వన్డేల్లో రోహిత్ కెరీర్ అద్భుతంగా ఉంది. అతను వన్డేల్లో 11,168 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 32 సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 264 రన్స్ చేసింది. రోహిత్ తన కెరీర్‌ను పెంచుకునేందుకు టెస్టులకు వ్యూహాత్మక రిటైర్మెంట్ ఇచ్చి ఉంటారని లాడ్ తెలిపారు. తదుపరి జనరేషన్‌కు ఛాన్సు ఇవ్వాలన్న ఉద్దేశంతో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడని లాడ్ పేర్కొన్నారు.
2013లో రోహిత్ తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 177 రన్స్ స్కోర్ చేశాడని, ఆ మ్యాచ్ తనకు బాగా గుర్తుండిపోతుందన్నారు. కెప్టెన్సీ అప్పగింత విషయంపై లాడ్ స్పందిస్తూ శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ఆ బాధ్యతలు తీసుకునే ఛాన్సు ఉంది. ఎవరిది ఎవరు ఏం తీసుకుంటారో తెలియదని, బీసీసీఐ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. చాలా మంది కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.