లండన్: ఇండియన్ టీమ్ ఓపెనర్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సమకాలీన క్రికెట్లో మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. వన్డేల్లో అయితే మూడు డబుల్ సెంచరీలతో అతన్ని మించిన వాళ్లు లేరు. అయితే అతడు ఎంత గొప్ప బ్యాట్స్‌మన్ అయినా సరే.. ఇన్నాళ్లూ ఓ వైఫల్యం అతన్ని నీడలా వెంటాడేది. టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా.. విదేశాల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడన్న అపవాదు రోహిత్‌పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ ఆ అపవాదును కూడా చెరిపేసుకున్నాడు. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి తన సత్తా ఏంటో చాటడంతోపాటు టీమ్‌ను కూడా ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యంతో మ్యాచ్‌లో పెద్దగా ఆశలు లేని స్థితి నుంచి ఇప్పుడు మ్యాచ్‌ను శాసించే స్థితికి టీమిండియా చేరడంలో రోహిత్‌దే కీరోల్.
ఈ నేపథ్యంలో ఎప్పుడో 2016లో అతడు చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. రోహిత్ చెప్పింది చేసే వ్యక్తి అని నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. మనం ఏదైతే చేయలేమని జనం అనుకుంటారో.. దానిని చేసి చూపించడం కంటే ఆనందం మరొకటి ఉండదు అని 2016, సెప్టెంబర్ 14న రోహిత్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను ఇప్పుడు అభిమానులు వైరల్‌గా మార్చేశారు. నిజానికి లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్ట్‌లోనే రోహిత్ ఈ ఘనతను అందుకునే వాడు.
ఆ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల దగ్గర ఔటై.. 17 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓవల్‌లో మాత్రం ప్రత్యర్థులకు ఆ చాన్స్ ఇవ్వలేదు. 94 పరుగుల దగ్గర ఉన్న సమయంలోనే ఏకంగా సిక్సర్‌తో తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు. రోహిత్ 127 పరుగులు చేయడంతో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 270 పరుగులు చేసింది. ప్రస్తుతం 171 పరుగుల లీడ్‌లో ఉన్న కోహ్లి సేన.. కనీసం మరో 100 పరుగులైనా చేయగలిగితే.. మ్యాచ్‌పై పట్టు బిగించినట్లే.
The greatest pleasure in life is doing what people say you cannot do 😊😊
— Rohit Sharma (@ImRo45) September 14, 2016