ముంబై : అంతర్జాతీయ క్రికెట్లో పేలవ ఆటతీరుతో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటూ ‘తప్పనిసరి పరిస్థితుల్లో’ దేశవాళీకి మళ్లిన భారత స్టార్ క్రికెటర్లు.. తమ రంజీ రీఎంట్రీలోనూ దారుణంగా విఫలమయ్యారు. తొమ్మిదేండ్ల తర్వాత ముంబై తరఫున రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ 3 పరుగులకే వెనుదిరిగాడు. రోహిత్‌తో పాటు జైస్వాల్ (4), పంజాబ్ సారథి గిల్ (4), ఢిల్లీకి ఆడుతున్న రిషభ్ పంత్ (1) కలిపి చేసింది 12 పరుగులే. జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉమర్ నజీర్ బౌలింగ్‌లో ఫుల్‌షాట్ ఆడబో యిన రోహిత్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఇదే జట్టులో మరో ఇద్దరు స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబె (0)లదీ అదే కథ. జమ్మూ పేసర్లు ఉమర్ నజిర్ (4/41), యుధ్వీర్ సింగ్ (4/31) ధాటికి ముంబై గజగజ వణికి 120 పరుగులకే ఆలౌట్ అయింది. జమ్ము బౌలర్ ఉమర్ స్వింగ్జోరుకు ముంబై బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. పుల్వామాకు చెందిన ఈ 31 ఏండ్ల బౌలర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ అదరగొట్టాడు. 12 ఏండ్ల క్రితం ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఆరడుగుల బౌలర్ అనతికాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగాడు.
మరోవైపు కర్నాటకతో జరిగిన మ్యాచ్‌లో గిల్‌తో పాటు ఆ జట్టు బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో పంజాబ్ 55 పరుగులకే కుప్పకూలింది. కానీ సౌరాష్ట్రకు ఆడుతున్న టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (5/66) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ 9 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.