ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ తన క్రికెట్ కొనసాగిస్తూనే బుల్లితెరపై హోస్ట్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. సోనీ టీవీలో ఈ నెల 19 నుంచి ప్రసారం కానున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్’ అనే గేమ్ షో ద్వారా రోహిత్ టీవీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమోలో హిట్‌మ్యాన్ తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ప్రోమోలో ‘గార్డెన్ సే రిపోర్టింగ్ లైవ్, జెర్సీ నంబర్ 45’ అని రోహిత్ చెప్పిన సంభాషణ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.
2024లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో మైదానంలో తోటి ఫీల్డర్లను ఉద్దేశించి ‘ఎవరూ గార్డెన్లో తిరగకూడదు’ అంటూ రోహిత్ చేసిన సరదా వ్యాఖ్య అప్పట్లో సంచలనం సృష్టించింది. అదే డైలాగ్‌ను ఇప్పుడు తన టీవీ షో ఎంట్రీకి రీ-క్రియేట్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ షో సెట్లో నటుడు రాకేష్ బేడీతో ముచ్చటిస్తూ.. ‘నాకు వేగంగా బౌలింగ్ వేసే వాళ్లంటే ఇష్టం.. కొందరు బౌలర్లను ఒకే చోట కొట్టడం ఇంకా ఇష్టం’ అని రోహిత్ వేసిన పంచ్‌లు షోపై అంచనాలను పెంచేశాయి. భారత్ తరఫున ప్రస్తుతం రోహిత్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కాగా,2027 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ స్థానంపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ చెక్ ఇటీవలే పెట్టింది.