ICC Rankings | ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడోస్థానానికి చేరుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్‌తో రాణించిన విషయం తెలిసిందే. 76 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన హిట్‌మ్యాన్.. బుధవారం విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండుస్థానాలు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరాడు. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి.. ఐదోస్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దుబాయిలో జరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ ఒక పరుగు చేయగా.. శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేశాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ర్యాకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో టాప్-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం రెండోస్థానంలో ఉన్నాడు.
ఇక బౌలర్లలో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా సైతం ర్యాంకింగ్స్‌లో మెరిశారు. కుల్దీప్ యాదవ్ రెండుస్థానాలు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా సైతం మూడుస్థానాలు మెరుగుపరుచుకొని పదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకకు బౌలర్ మహిష్ తీక్షణ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 680 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండోస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచేల్ శాంట్నర్ ఉండగా.. కేశవ్ మహరాజ్ (సౌతాఫ్రికా), బెర్నార్డ్ మార్టినస్ స్కోల్ట్జ్ (నమీబియా), మ్యాట్ హెన్రి (న్యూజిలాండ్), రషిద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), గుడాకేష్ మోటీ (వెస్టిండిస్), షాహిన్ ఆఫ్రిది (పాకిస్తాన్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.