హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విదేశాల్లో తొలి టెస్టు శతకంతో విజృంభిస్తే.. చతేశ్వర్ పుజారా గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరో చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ లోకేశ్ రాహుల్ కూడా తన వంతు తోడ్పాటు అందించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అధిగమించి 171 పరుగుల ముందంజలో నిలిచిన టీమ్ఇండియా.. ఆదివారం ఆతిథ్య జట్టుకు ఎంత టార్గెట్ ఇస్తుందనేది ఆసక్తికరం!
లండన్: టాపార్డర్ రాణించడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఓపెనర్ రోహిత్ శర్మ (256 బంతుల్లో 127; 14 ఫోర్లు, ఒక సిక్సర్) విదేశాల్లో తొలి టెస్టు శతకం నమోదు చేసుకోగా.. చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (46) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (22), రవీంద్ర జడేజా (9) క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 43/0తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆరంభంలో ఇంగ్లిష్ పేసర్లను ఆచితూచి ఎదుర్కొన్న రోహిత్, రాహుల్ క్రీజులో నిలదొక్కుకున్నాక ధాటిగా ఆడారు. తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించాక అండర్సన్ బౌలింగ్‌లో రాహుల్ ఔట్ కాగా.. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఫలితంగా భారత్ 108/1తో తొలి సెషన్ ముగించింది. లంచ్ తర్వాత.. పుజారా బౌండ్రీలతో విరుచుకుపడగా.. రోహిత్ శర్మ 145 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ.. మోయిన్ అలీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే పుజారా కూడా హాఫ్‌సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఇక భారత్‌కు తిరుగులేదు అనుకుంటున్న దశలో ఇంగ్లండ్ కొత్త బంతితో మాయ చేసింది. రాబిన్సన్ వేసిన 81 ఓవర్ తొలి బంతికి రోహిత్ ఔట్ కాగా.. చివరి బంతికి పుజారా కూడా వెనుదిరిగాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 191, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290, భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) వోక్స్ (బి) రాబిన్సన్ 127, రాహుల్ (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 46, పుజారా (సి) అలీ (బి) రాబిన్సన్ 61, కోహ్లీ (నాటౌట్) 22, జడేజా (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 270/3. వికెట్ల పతనం: 1-83, 2-236, 3-237, బౌలింగ్: అండర్సన్ 23-8-49-1, రాబిన్సన్ 21-4-67-2, వోక్స్ 19-5-43-0, ఓవర్టన్ 10-0-38-0, అలీ 15-0-63-0, రూట్ 4-1-7-0.