క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో.. లోకప్రియ క్రీడ మరో మైలురాయికి చేరువైంది! అందరికంటే ఆలస్యంగా వన్డేలాడటం ప్రారంభించిన టీమ్ఇండియా.. వెయ్యో మ్యాచ్‌కు రెడీ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో 1000వ మ్యాచ్ ఆడనున్న తొలి జట్టుగా చరిత్రకెక్కనున్న రోహిత్ సేన.. దాన్ని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని చూస్తున్నది!!
విరాట్ ఎక్కడ వదిలేశాడో అక్కడి నుంచే ప్రారంభిస్తా అని కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేయగా.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు! వచ్చే ఏడాది జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు ద్రవిడ్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.. సారథ్య బాధ్యతలు పక్కన పెట్టాక తనలోని పోరాట యోధుడిని మరోసారి ప్రపంచానికి చాటాలని కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. మరింకెందుకు ఆలస్యం స్వదేశంలో వెస్టిండీస్‌తో లిమిటెడ్ ఓవర్స్ మజాను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
అహ్మదాబాద్: భారత వన్డే క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం (1974లో) తొలి వన్డే ఆడిన టీమ్ఇండియా.. ఆదివారం వెస్టిండీస్‌తో తమ 1000వ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. చారిత్రక సందర్భాన్ని విజయంతో గుర్తుండిపోయేలా మార్చుకోవాలనుకుంటున్న రోహిత్ సేన అందుకోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. భారత క్రికెట్లో ఎన్నో మరపురాని మైలురాళ్లకు సాక్షిగా నిలిచిన మొతెరా (నరేంద్రమోదీ) స్టేడియం.. ఈ చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. సఫారీ టూర్లో పేలవ ప్రదర్శన.. కెప్టెన్సీ విషయంలో గందరగోళం.. కరోనా విజృంభణ.. ఇలా గత నెలరోజుల్లో అనేక అవరోధాలను ఎదుర్కొన్న టీమ్ఇండియా.. మైదానంలో తమ ప్రదర్శనతో వాటిన్నింటిని పక్కన పెట్టి అందరి దృష్టిని ఆటపైకి తేవాలని భావిస్తున్నది! మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం తొలి వన్డే జరుగనుండగా.. 2023 వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలనుకుంటున్న రాహుల్ ద్రవిడ్.. మిడిలార్డర్‌పై దృష్టి పెట్టడంలో నిమగ్నమయ్యాడు! రోహిత్-ద్రవిడ్ జోడీకి స్వదేశంలో ఇదే తొలి పరీక్ష కాగా.. మూడు ఫార్మాట్లలో సారథ్యానికి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ఆకలిగొన్న సింహంలా పరుగుల వేట ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌పై టీ20 సిరీస్‌ను చేజిక్కించుకొని మంచి జోష్‌లో ఉన్న వెస్టిండీస్.. అదే జోరులో టీమ్ఇండియాకు ఝలక్ ఇవ్వాలని చూస్తున్నది.
కరోనా సోకడంతో శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ ఐసొలేషన్‌కు పరిమితమవగా.. వన్డే జట్టుకు ఎంపికైన మయాంక్ అగర్వాల్ క్వారంటైన్లో ఉన్నాడు. దీంతో రోహిత్ పాటు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రానున్నారు. లోయర్ ఆర్డర్లో దీపక్ హుడాకు అవకాశం దక్కుతుందా చూడాలి. సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి విశ్రాంతినివ్వడంతో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగొచ్చు. ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కుతుందా చూడాలి. ‘కుల్చా’ జోడీ కుల్దీప్, చాహల్ జట్టులో ఉండటం దాదాపు ఖాయమే!
షారుక్‌కు చోటు
సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో.. ముందు జాగ్రత్త చర్యలకు పూనుకున్న సెలెక్షన్ కమిటీ ఇషాన్ కిషన్, షారుక్ ఖాన్‌ను జట్టుతో చేర్చింది. చెన్నైకి చెందిన షారుక్ ఇటీవల కాలంలో ఫినిషర్‌గా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడి వెలుగులోకి వచ్చాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్, కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దీపక్ హుడా/సుందర్, దీపక్ చాహర్/సిరాజ్, శార్దూల్, కుల్దీప్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్: పొలార్డ్ (కెప్టెన్), షై హోప్, బ్రాండన్ కింగ్, పూరన్, బ్రూక్స్, బ్రావో, ఓడెన్/షెఫర్డ్, హోల్డర్, అకీల్, రోచ్, హైడెన్ వాల్ష్.
పిచ్, వాతావరణం
ఏడేండ్ల తర్వాత ఇక్కడ వన్డే మ్యాచ్ జరుగనుండగా.. పిచ్ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలున్నాయి. చివరి సారిగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఇక్కడ జరిగిన టీ20లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మైదానం బౌండ్రీలు పెద్దవి. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.