Rohit Sharma : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌కు వేళైంది. మెగా టోర్నీలో రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం ఐర్లాండ్(Ireland)తో బుధవారం రాత్రి 8 గంటలకు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. ద్రవిడ్ ఒక రోల్ మోడల్ అని, ఆయనను మరికొన్ని రోజులు కోచ్‌గా కొనసాగాలని కోరానని, అతడిని ఒప్పించేందకు ప్రయత్నించానని హిట్‌మ్యాన్ తెలిపాడు.
అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్‌తో ద్రవిడ్ కోచ్ పదవి ముగుస్తుంది. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు కొత్త కోచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. పైగా ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ (Gautam Gambhir) నియామకం దాదాపు పూర్తి అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్.. ద్రవిడ్‌కు మద్దుతుగా నిలవడం గమనార్హం. కానీ, ద్రవిడ్ మరోసారి తన కాంట్రాక్ట్‌ను పొడింగిచుకునే ఉద్దేశంలో లేడని తెలుస్తోంది. మరోవైపు జూన్ 26 లోపు కొత్త కోచ్ పేరు వెల్లడించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది.
మిస్టర్ డిపెండబుల్.. ది వాల్.. ఈ పేర్లు చెవినపడగానే ఎవరికైనా రాహుల్ ద్రవిడ్ గుర్తుకొస్తాడు. తన జిడ్డు, సొగసరి ఆటతో టీమిండియా చిరస్మరణీయ విజయాల్లో భాగమైన అతడు.. రవి శాస్త్రి(Ravi Shastri) వారసుడిగా టీమిండియా హెడ్‌కోచ్ అయ్యాడు. సౌమ్యుడు, శాంత స్వభావి అయిన ద్రవిడ్ తన మార్క్ నిర్ణయాలతో అనతికాలంలోనే జట్టుపై తన ముద్ర వేశాడు. రొటేషన్ పద్దతిని తీసుకొచ్చి.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్.. వంటి వాళ్లకు అవకాశాలు కల్పించాడు.
ద్రవిడ్ శిక్షణలో భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ చేరింది. ఆ ఆర్వాత ఆసియా కప్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఇక సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2024)లో 10 విజయాలతో ప్రత్యర్థులను రోహిత్ సేన వణికిచింది. అయితే.. కీలకమైన టైటిల్ పోరులో తడబడి మరోసారి ఆస్ట్రేలియాకు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ని సమర్పించుకుంది. దాంతో, తన ఆధ్వర్యంలో భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించాలని ద్రవిడ్ పట్టుదలతో ఉన్నాడు. అంతేకాదు కోచ్‌గా అతడికి ఇదే చివరి టోర్నీ. సో.. వరల్డ్ కప్ ట్రోఫీని ద్రవిడ్‌తో పాటు సీనియర్లు రోహిత్, విరాట్ కోహ్లీలకు కానుకగా ఇవ్వాలని భారత బృందం భావిస్తోంది.