Virat Kohli | భారత జట్టు మూలస్తంభాలైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య పొరపొచ్చులు ఉన్నాయనే వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. గ్రౌండ్ బయట జరిగే విషయాలను పెద్దగా పట్టించుకోమని ఈ ఇద్దరు గతంలో ఎన్నో సార్లు చెప్పినా.. ప్రతిసారి కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు అనే పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో కోహ్లీతో తన బంధం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. విరాట్‌తో ఎలాంటి విషయాల గురించి చర్చిస్తాడో వాటిని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. దీంతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు.
ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవడంలో మిస్టర్ డిపెండబుల్ది కీలక పాత్ర అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.‘నేను కోహ్లీ కలిసి క్రీజులో ఉన్నప్పుడు సాధారణంగా ఎవరు బౌలింగ్ చేస్తున్నారు. వాళ్లను ఎలా ఎదుర్కోవాలి. వాళ్ల బలహీనతలేంటి.. ఎటువైపు షాట్లు ఆడితే సులువుగా పరుగులు వస్తాయి అనే విషయాలు ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఇక మ్యాచ్ బయట అయితే.. త్వరలో ఆడనున్న సిరీస్‌లు ఏవి, అందులో ప్రమాదకర ప్లేయర్లు ఎవరు.. వాళ్లపై కన్నేసి ఉంచడం ఇలాంటివి చర్చించుకుంటాం’ అని రోహిత్ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదన్న రోహిత్.. ‘రాహుల్ ద్రవిడ్ భాయ్ విషయానికి వస్తే.. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఎవరితోనూ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం ద్రవిడ్‌కు ఇష్టం ఉండదు. విషయం ఏదైనా సంబంధిత వ్యక్తం ముందే చెప్పేస్తాడు. దీంతో అందరూ కలివిడిగా ఉంటారు’ అని అన్నాడు.