Rohit Sharma | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్ ఐదు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో డకౌట్ అయిన రోహిత్.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన విషయం తెలిసిందే.
ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన పోరులో సూపర్ సెంచరీ (131) చేసి విశ్వ సమరంలో ఏడో శతకం తన పేరిట రాసుకొని రికార్డుల్లోకి ఎక్కిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లుతో 86 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనలతో రోహిత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు. 719 ర్యాంకింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో ర్యాంక్‌కు చేరగా.. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 711 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్-10 బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. అత్యుత్తమంగా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో ర్యాంక్‌లో ఉండగా.. రోహిత్, కోహ్లీ టాప్-10లో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. క్వింటన్ డికాక్ మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఆసీస్ పేసర్ జోష్ హజిల్‌వుడ్ టాప్‌లో ఉండగా.. టీమ్ఇండియా నుంచి మహమ్మద్ సిరాజ్ (3వ ర్యాంక్), కుల్దీప్ యాదవ్ (8వ ర్యాంక్) టాప్-10 చోటు దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తొమ్మిదో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.