మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో కీలకమైన బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ. ఆదివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కెప్టెన్ రోహిత్‌శర్మ గాయపడ్డాడు. ప్రాక్టీస్ పిచ్‌లపై త్రోడౌన్ స్పెషలిస్టు దయానంద్ గరానీ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ ఎడమ కాలికి గాయమైంది. నొప్పితో బాధపడుతూ కనిపించిన హిట్‌మ్యాన్ ఐస్ప్యాక్తో కొద్దిసేపు సేదతీరాడు.
అయితే గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత పేసర్ ఆకాశ్‌దీప్‌సింగ్ మాట్లాడుతూ రోహిత్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొన్నాడు. సోమవారం ప్రాక్టీస్‌కు విశ్రాంతి అని తెలిపాడు. ఇదిలా ఉంటే ప్రాక్టీస్ కోసం కేటాయించిన పిచ్‌లు మరీ నాసిరకంగా ఉన్నట్లు టీమ్ఇండియా క్రికెటర్లు వాపోయారు. అసలు ఏమాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవని అన్నారు.