మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ముందు భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో సూపర్‌ఫామ్‌మీదున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంజ్యూరీ అవగా.. తాజాగా కెప్పెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా గాయపడ్డాడు. మెల్మోర్న్లో ప్రాక్టీస్ చేస్తుండగా హిట్‌మ్యాన్‌కి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే క్రమంలో రోహిత్ ఎడమ మోకాలికి బాల్ బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడినట్లు పలు రిపోర్టులు పెర్కొన్నాయి. వెంటనే అతనికి ఫిజియో ఐస్ ప్యాక్‌ను తెచ్చి మోకాలి మర్ధన చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే రోహిత్ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కాగా, శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ కుడిచేతికి బంతి బలంగా తాకిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే ఫిజియో ప్రాథమిక చికిత్స అధించాడు. అయితే రాహుల్ గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తున్నది. ఇక రోహిత్ బాక్సింగ్ డే టెస్ట్‌కు దూరమైతే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లో ఎవరినో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. మూడో టెస్టు డ్రాగా ముగిసింది.