బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో కీలకమైన మూడో టెస్టులో భారత్ (Ind vs Aus) ఎదురీదుతున్నది. టాపార్డర్ అంతా మూకుమ్మడిగా విఫలమవడంతో తొలి ఇన్నింగ్స్‌లో వెనుకపడిపోయింది. 4 వికెట్ల నష్టానికి 51 రన్స్ చేసిన టీమ్ఇండియా.. నాలుగో రోజూ ఆటను కష్టంగా ప్రారంభించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నప్పటికీ.. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లు వెనుతిరుగుతున్నారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. 27 బాల్స్‌లో 10 రన్స్ చేసిన కెప్టెన్.. ఇన్నింగ్స్ 23.3వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో క్రిజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్టున్నాడు. ప్రస్తుతం 39.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది.
బ్యాటింగ్ ఢమాల్
గబ్బా పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు పోరాట పటిమ కనబర్చిన చోట భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ పేస్ త్రయం స్టార్క్, హాజిల్‌వుడ్, కమిన్స్ పదునైన పేస్ ధాటికి టీమ్ఇండియా 44 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి జైస్వాల్..మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మూడో ఓవర్లో స్టార్క్ ఔట్‌సైడ్ ఆఫ్‌సైడ్ బంతిని ఆడిన గిల్..మార్ష్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీ మరోమారు ఉసూరుమనిపించాడు. హాజిల్‌వుడ్ ఊరించే బంతిని డ్రైవ్ ఆడబోయిన కోహ్లీ.. కీపర్ క్యారీకి క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. పలుమార్లు వర్షం అంతరాయంతో ఏకాగ్రత దెబ్బతిన్న పంత్..కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతోఇంతో రాహుల్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు.