Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్‌లో దంచేస్తున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా తొలి సారథిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. గయానాలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హిట్‌మ్యాన్ వీరకొట్టుడు కొట్టాడు. ఇంగ్లీష్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న రోహిత్ సూపర్ అర్ధ సెంచరీ (57)తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
కెప్టెన్‌గా హిట్ అయిన రోహిత్ జట్టును ఏకంగా మూడు ఐసీసీ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. దాంతో, న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) సరసన నిలిచాడు. కేన్ మామా సారథ్యంలో కివీస్ డబ్ల్యూటీసీ, వన్డే, టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరింది. రోహిత్ సారథ్యంలో వరుసగా మూడో ఐసీసీ ఫైనల్స్ ఆడుతున్న టీమిండియా 11 ఏండ్ల ట్రోఫీ కలకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
విలియమ్సన్, రోహిత్ శర్మ
హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో అదరగొడుతున్న భారత్ నిరుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ), వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడింది. ఇప్పుడు జూన్ 29న దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో టీమిండియా తలపడనుంది. అయితే.. టెస్టు గదతో పాటు వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించిన భారత్ ఈసారి ట్రోఫీని వదలొద్దనే పట్టుదలతో ఉంది.
టీ20 వరల్డ్ కప్‌లో పరుగుల దాహంతో ఉన్న రోహిత్ టీమిండియాకు గెలుపు తోవ చూపిస్తున్నాడు. ఓపెనర్‌గా చితక్కొడుతున్న అతడు అతడు తాజాగా అన్ని ఫార్మట్లలో 5 వేల పరుగులు కొట్టిన ఐదో కెప్టెన్‌గా రోహిత్ మరో మైలురాయికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ విధ్వంసక ఓపెనర్ ఖాతాలో 5,013 పరుగులు ఉన్నాయి.
హిట్‌మ్యాన్ కంటే ముందు మాజీ కెప్టెన్లు మహ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ (MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఈ మైలురాయిని అధిగమించారు. ఈ జాబితాలో కోహ్లీ 12,883 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక ధోనీ 11,207 రన్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అజారుద్దీన్ 8,095 పరుగులు సాధించగా.. దాదా 7,643 రన్స్ కొట్టాడు.