ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యాడు. రోహిత్, రితిక సాజ్దే దంపతులకు కొడుకు పుట్టినట్లు సమాచారం. శుక్రవారం సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ఈ సమాచారాన్ని షేర్ చేశారు. అయితే దీనిపై ఇంకా ద్రువీకరణ రాలేదు. రోహిత్ దంపతులకు తొలి సంతానం అమ్మాయి. సమైరా ప్రస్తుతం ఆరేళ్లు ఉన్నది. అయితే కుమారుడి జననం గురించి త్వరలో రోహిత్ ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్నది. పెర్త్‌లో జరిగే తొలి టెస్టులో ఆడేందుకు క్రికెటర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నారు. కానీ రోహిత్ మాత్రం ఆస్ట్రేలియా వెళ్లలేదు. అయితే రోహిత్ ఎప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్తాడన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బహుశా అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కోచ్ గంభీర్ తెలిపాడు. ఒకవేళ తొలి టెస్టు వరకు రోహిత్ చేరకుంటే, అప్పుడు అతని స్థానంలో బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.