ఢిల్లీ : ప్రపంచకప్ అంటే చాలు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూనకం వచ్చినట్టు సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటాడు. నిలబడి మంచినీళ్లు తాగినంత తేలికగా భారీ సిక్సర్లతో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తాడు. ఈసారి సొంత గడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో హిట్‌మ్యాన్ తొలి సెంచరీ కొట్టాడు. అఫ్గనిస్థాన్‌పై శతకంతో విజృంభించిన హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో పలు రికార్డులు తిరగరాశాడు. రోహిత్ ధాటికి యూనివర్సల్ బాస్‌గా పేరొందిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల(553) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల (556) వీరుడిగా హిట్‌మ్యాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గేల్ రికార్డు బద్ధలు కొట్టడానికి రోహిత్‌కి స్ఫూర్తి ఎవరో తెలుసా..? ఇంకెవరూ గేల్.
ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా వెల్లడించాడు. యూనివర్స్ బాస్ ఎల్లప్పుడూ యూనివర్స్ బాసే. అయితే.. నేను అతడి రికార్డులు పుస్తకంలోంచి ఒక పేజీని తీసేసుకున్నా. చాలాఏళ్లుగా గేల్ ఆటను మనం చూశాం. అతడొక సిక్సర్ల మెషిన్. పైగా మా ఇద్దరి జెర్సీ నంబర్(45) కూడా ఒకటే. 45 నంబర్ జెర్సీ ఆటగాడు తన రికార్డు బ్రేక్ చేసినందుకు గేల్ చాలా సంతోషిస్తాడని నేను అనుకుంటున్నా అని రోహిత్ వెల్లడించాడు. అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ 81 బంతుల్లోనే 131 పరుగులు సాధించాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు ఉన్నాయి. దాంతో, టెసులు, వన్డే, టీ20.. ఈ మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల (556) వీరుడిగా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. గేల్ 483 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధిస్తే.. రోహిత్ అతడి కంటే తక్కువ మ్యాచుల్లో(453)నే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.