Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వెనుకంజలో ఉన్న టీమిండియా.. కీలకమైన సిడ్నీ టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్ మేనేజ్మెంట్ పక్కనపెట్టింది. మెల్బోర్న్ టెస్టులో పరాజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. సిడ్నీ టెస్టుకు హిట్‌మ్యాన్‌ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే టీమ్ మేనేజ్మెంట్ రోహిత్‌పై వేటు వేసింది. కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించింది. టాస్ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ బుమ్రా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు.
సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో టెస్టుల్లో అతని భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే హిట్‌మ్యాన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికా, వెస్టిండిస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన తర్వాత విరాట్‌తో పాటు రోహిత్ సైతం రిటైర్మెంట్ను ప్రకటించారు. తాజాగా టెస్టుల్లో కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొన్నది. ఇకపై రోహిత్ ఈ ఫార్మాట్లో కనిపించే అవకాశం లేదని.. రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు పేర్కొన్నారు.
రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు. అయితే, రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడని పలువురు మాజీలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న కెప్టెన్ రోహిత్.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కోసం త్యాగం చేశాడని అంటున్నారు. మెల్బోర్న్ టెస్టు సమయంలో గిల్ తన స్థానాన్ని త్యాగం చేశాడు. మళ్లీ గిల్ తుదిజట్టులోకి తిరిగి రావడానికి శుభ్‌మన్ గిల్‌కు ఉన్న ఏకైన అవకాశం రోహిత్ స్థానం మాత్రమే. ఈ పరిస్థితుల్లో రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. జట్టు గెలుపునకే ప్రాధాన్యం ఇచ్చాడని పలువురు మాజీలు పేర్కొన్నారు.
రోహిత్ శర్మ టీమిండియాకు ఎంతో కీలకమైన ఆటగాడు. కానీ, గత కొంతకాలంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు. గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రోహిత్.. 26 ఇన్నింగ్స్‌లో 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, మరో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.