అన్ని ఫార్మాట్లలో టీమిండియా సారధిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. జట్టులోని ముగ్గురు సభ్యుల గురించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఈ ముగ్గుర్నీ లీడర్లుగానే చూస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. వాళ్లే కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు భవిష్యత్తులో టీమిండియా పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వీరి గురించి రోహిత్ మాట్లాడాడు.
‘‘వాళ్లకు ప్రతి విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు మెచ్యూరిటీ ఉంది. తమపై ఎటువంటి బాధ్యత ఉందో కూడా తెలుసు. ఎప్పుడైనా వాళ్లకు ఏమైనా సలహా ఇవ్వాల్సి వస్తేనే నా అవసరం ఉంటుంది. మాక్కూడా అలాగే నేర్పించారు. మేం కూడా తర్వాతి వాళ్లకు అలాగే నేర్పిస్తాం. ప్రతి ఒక్కరూ అలా నేర్చుకోవాల్సిందే’’ అని రోహిత్ అన్నాడు.
కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ విషయానికి వస్తే.. జట్టులో వారిది చాలా కీలక పాత్ర అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. అయితే వాళ్లపై ఉండే బాధ్యత ఒత్తిడికి దారి తీయకుండా చూసుకుంటామన్నాడు. గేమ్‌ను ఎంజాయ్ చేస్తూ తమ నైపుణ్యాలను స్వేచ్ఛగా చూపించే అవకాశం వారికి కల్పించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశాడు. జట్టుకు వాళ్ల అవసరం చాలా ఉందని పేర్కొన్నాడు.