Padma Shri : భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు అత్యున్నత పౌరపురస్కారం దక్కింది. క్రికెట్‌కు విశేష సేవలందించినందుకుగానూ హిట్‌మ్యాన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్శ శ్రీ(Padma Shri)ని ప్రకటించింది. భారత మహిళల జట్టును వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కూడా పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైంది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని ఆదివారం కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాలను ప్రకటించింది. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్(Vijay Amrutraj)ను ‘పద్మ భూషణ్’ వరించింది.
భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లకు తగిన గౌరవం దక్కింది. సారథిగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ కట్టబెట్టిన రోహిత్ పద్మ శ్రీకి ఎంపికయ్యాడు. నిరుడు స్వదేశంలో అద్భుత కెప్టెన్సీతో మహిళల జట్టుకు తొలిసారి వన్డే వరల్డ్‌కప్ అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం ఈ పురస్కారం అందుకోనుంది. మహిళా క్రికెటర్లలో ఈ ఘనత సొంతం చేసుకున్న ఐదో ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్, పురుషుల క్రికెట్లో ఈ అవార్డుకు ఎంపికైన 17వ ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించారు.
Rohit Sharma and Harmanpreet Kaur set to receive the Padma Shri for excellence in Sports 🇮🇳🏏 pic.twitter.com/j2kYPeeZMH
— CRICKETNMORE (@cricketnmore) January 25, 2026
పద్మ శ్రీ గెలుపొందిన తొలితరం క్రికెటర్లుగా డి.బీ. డియోధర్(1965), మన్సూర్ అలీఖాన్ పటౌడీ(1967), చందు బొర్డే(1969), బిషన్ సింగ్ బేడీ(1970)లు చరిత్రలో నిలిచారు. 1999లో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం స్వీకరించారు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, అశ్విన్ సైతం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ కంటే ముందు శాంతా రంగస్వామి , డయాన ఎడుల్జి, మిథాలీ రాజ్, ఝులాన్ గోస్వామి పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆనవాయితీ ప్రకారం గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేషంగా కృషి చేసినవారిని గౌరవిస్తూ.. ఆదివారం పద్మ అవార్డులను వెల్లడించింది. అసమాన ప్రతిభాపాటవాలతో తమ రంగాల్లో చెరగని ముద్ర వేసిన 131 మందికి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. పద్మ విజేతలు మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు స్వీకరించనున్నారు.