Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) స్వదేశం చేరుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్.. అక్కడి నుంచి ఈమధ్యే ముంబైలో దిగాడు. వైద్య నిపుణులను కలిసిన పంత్ ఆలస్యం చేయకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించనున్నాడు. వెస్టిండీస్‌తో జరుగబోయే టెస్టు సిరీస్ లక్ష్యంగా పెట్టుకున్న పంత్ త్వరలోనేబెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరనున్నాడు. ఒకవేళ ఈ సిరీస్‌లోపు ఫిట్నెస్ సాధించకుంటే అక్టోబర్ – నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ఈ డాషింగ్ బ్యాటర్ వెళ్లే అవకాశముంది.
గాయం కారణంగా జట్టుకు దూరమైన పంత్ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటున్నాడు. త్వరగా కోలుకొని మైదానంలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌లు పెడుతున్నాడు. ‘నేనొక విషయం అర్ధం చేసుకున్నా. గతంలో మీరు ఎంతో బాధ పడి ఉండవచ్చు.. కానీ తాజాగా అయిన గాయం కూడా అంతే బాధిస్తుంది. నొప్పి ఎక్కువనిపించినా సరే కోలుకునేందుకు కష్టపడాల్సిందే. అందుకే పాజిటివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. స్వీయ నమ్మకంతో ఉంటూ.. మీరు జీవించాలనుకున్న దిశగా సాగాలి’ అని తన ఆలోచనల్ని పంచుకున్నాడీ వైస్ కెప్టెన్.
‘నాకు లభిస్తున్న మీ ప్రేమ, ఆశీస్సులకు ధన్యుడిని. నేను ద్రుఢంగా ఉండడానికి కారణం మీరే. నా పాదం ఎముక గాయం నయం కాగానే రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్తాను. ఓపికగా ఉండడం, నిపుణుల సూచలనల్ని పాటించడం, నా నుంచి 100 శాతం కృషి చేయడం, .. ఇవే నా ప్రాధాన్యాలు. దేశం తరఫున ఆడడం నా జీవితంలో ఎల్లప్పుడూ గర్వపడే క్షణమే. నాకెంతో ఇష్టమైన ఆటను మళ్లీ ఆడేందుకు ఆతృతగా ఉన్నాను’ అని పంత్ తాజా పోస్ట్‌లో వెల్లడించాడు.
మూడు ఫార్మట్లలో కీలక ఆటగాడైన పంత్ మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోగా బంతి అతడి కుడి పాదానికి గట్టిగా తగిలింది. స్కానింగ్ పరీక్షల అనంతరం పాదంలో ఎముక విరిగినట్టు తేలింది. దాంతో.. డగౌట్‌కు చేరిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో శార్ధూల్ ఠాకూర్ ఔటయ్యాక కుంటుతూనే క్రీజులోకి వచ్చాడు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇన్నింగ్స్ కొనసాగించిన పంత్.. అర్ధ శతకం బాది వెనుదిరిగాడు. అయితే.. గాయం తీవ్రత కారణంగా చివరిదైన ఓవల్ టెస్టుకు పంత్ దూరమయ్యాడు.