Rinku Singh : ఐపీఎల్‌తోనే టీ20ల్లో విధ్వంసక ఆటగాడిగా నిరూపించుకున్న రింకూ సింగ్ (Rinku Singh) ఇప్పుడు టీమిండియా ఫినిషర్ పాత్రలో ఒదిగిపోతున్నాడు. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికారేసిన రింకూ.. జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. డెత్ ఓవర్లలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ కేవలం 20 బంతుల్లోనే 44 రన్స్ సాధించాడు. తద్వారా.. పొట్టి క్రికెట్లో 300లకు పైగా స్ట్రయిక్ రేటుతో ‘సరిలేరు నాకెవ్వరు’ అని మరోసారి చాటాడీ చిచ్చరపిడుగు.
భారీకాయం, ఆరడగుల ఎత్తు లేకుంటేనేం.. అలవోకగాబంతిని అమాంతం స్టాండ్స్‌లోకి పంపే రింకూ సింగ్‌ను చూస్తే ‘టీ20ల కోసమే పుట్టాడా?’ అనిపించకమానదు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తురుపుముక్కగా అవతరించిన రింకూ.. భారత జెర్సీతోనూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు. డెత్ ఓవర్లలో ఆకాశమే హద్దుగా విరుచుకుపడే ఈ పవర్ హిట్టర్ స్ట్రయిక్ రేటులో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. స్కూప్, లాగ్స్, ర్యాంప్స్ స్వీప్ షాట్లతో చెలరేగే అతడు19, 20 ఓవర్లలో 287.8 స్ట్రయిక్ రేట్ నమోదు చేశాడు.
Rinku Singh excels in the last two overs ⚡ pic.twitter.com/Wk5OJwZaq8
— ESPNcricinfo (@ESPNcricinfo) January 23, 2026
ఇక 20వ ఓవర్ తీసుకుంటూ రింకూ స్ట్రయిక్ రేటు 302.63 కావడం విశేషం. భారత సారథి సూర్యకుమార్ యాదవ్(Surya kumar Yadav) 321.42తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌గా ముద్రపడిన సూర్య స్ట్రయిక్ రేటు 19, 20 ఓవర్లలో 261.3 మాత్రమే. ఒకప్పుడు బౌలర్లను వణికించిన బ్రెండన్ మెక్కల్లమ్(న్యూజిలాండ్) 260.4తో మూడో ప్లేస్ సాధించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ 251.4తో నాలుగు, శ్రీలంక వెటరన్ తిలకరత్నే దిల్షాన్ (246.8) ఐదో ర్యాంక్‌లో నిలిచారు. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ సగటులోనూ రింకూ 42.6తో అగ్రస్థానంలో ఉండడం విశేషం.
డెత్ ఓవర్లు కాకుండా మొత్తంగా చూస్తే రింకూ స్ట్రయిక్ రేటు 165గా ఉంది. ఓపెనర్ అభిషేక్ 190.92తో టాప్‌లో ఉన్నాడు. నాగ్‌పూర్‌లో 13.4 ఓవర్లకే ఐదు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన రింకూ తన మార్క్ షాట్లతో చెలరేగాడు. అజేయంగా నిలిచిన అతడు.. భారత్‌కు 238 రన్స్ సాధించి పెట్టాడు.
Going, going, GONE! 🚀
🎥 Rinku Singh with a fabulous final flourish to power #TeamIndia to 2⃣3⃣8⃣/7 👏
Scorecard ▶️ https://t.co/ItzV352h5X#INDvNZ | @IDFCFIRSTBank | @rinkusingh235 pic.twitter.com/BGTv4m3NxD
— BCCI (@BCCI) January 21, 2026
‘క్రీజులోకి రాగానే దంచాలనుకోను. సింగిల్స్, డబుల్స్ తీయడం గురించే ఆలోచిస్తా. ఆ తర్వాత బౌండరీలు బాదడడమే పనిగా పెట్టుకుంటా’ అని రింకూ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో అతడు ఇలానే సంచలన ఇన్నింగ్స్‌లు ఆడితే త్వరలో స్వదేశంలో జరుగబోయే వరల్డ్‌కప్‌లో ఫినిషర్ పాత్ర పోషించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.