ముంబై: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌పై .. టీమిండియా కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) సీరియస్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో రికీ చేసిన వ్యాఖ్యలను గంభీర్ తప్పుపట్టారు. గడిచిన అయిదేళ్ల టెస్టు కెరీర్లో.. కోహ్లీ కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశాడని ఇటీవల రికీ పాంటింగ్ విమర్శించారు. ఆ విమర్శలకు కోచ్ గంభీర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లడానికి టీమిండియా సిద్దమైన నేపథ్యంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ మాట్లాడారు. కోహ్లీ ఫామ్‌పై రికీ చేసిన వ్యాఖ్యలను రిపోర్టర్లు ప్రశ్నించారు. ఆ సమయంలో గంభీర్ కొంత ఆవేశానికి గురయ్యారు.
భారతీయ క్రికెట్‌తో పాంటింగ్‌కు సంబంధం ఏంటని గంభీర్ ఎదురు ప్రశ్న వేశారు. అతను ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలని, కోహ్లీ గురించి కానీ రోహిత్ గురించి కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ఇద్దరూ అసాధారణ ప్లేయర్లు అని గంభీర్ తెలిపారు. భారత క్రికెట్ కోసం వాళ్లు ఎంతో చేశారని, భవిష్యత్తులోనూ ఆ ఇద్దరూ ఉత్తమ ప్రదర్శన ఇవ్వనున్నట్లు గంభీర్ తెలిపారు.
నెట్స్‌తో పాటు మ్యాచుల్లోనూ కోహ్లీ, రోహిత్‌లు హార్డ్‌వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారని, ఆట గురించి వాళ్లలో ఇంకా ప్యాషన్ ఉందని, ఇంకా ఎంతో సాధించాలన్న తపన ఉన్నదని, డ్రెస్సింగ్ రూమ్‌లో వాళ్లు ప్రదర్శించే ఆసక్తి అసాధారణమైందన్నారు. అయిదేళ్లలో ఓ టాపార్డర్ బ్యాటర్ టెస్టుల్లో కేవలం రెండు సెంచరీలు చేస్తే, ఏదో సమస్య ఉన్నట్లే అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు.