వడోదర : అమ్మాయిల ధనాధన్ పోరుకు అదిరిపోయే ఆరంభం. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే అభిమానులు బౌండరీలు, సిక్సర్ల వర్షంలో తడిసి ముద్దయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ జెయింట్స్ మధ్య శుక్రవారం వడోదర వేదికగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఛేదన (202)ను బెంగళూరు విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్ సారథి ఆష్లే గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్సర్లు) బ్యాట్‌తో పాటు బంతి (2/33)తోనూ మాయ చేసినా జెయింట్స్‌కు పరాభవం తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు గార్డ్నర్తో పాటు బెత్ మూనీ (42 బంతుల్లో 56, 8 ఫోర్లు) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఆర్సీబీ.. రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎలీస్ పెర్రీ (34 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కనిక అహుజా (13 బంతుల్లో 30 నాటౌట్, 4 ఫోర్లు) మెరుపులతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది.
కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరుకు ఆరంభంలోనే డబుల్ షాక్ తగిలింది. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన గార్డ్నర్.. రెండో ఓవర్లో బంతిని అందుకుని నాలుగు బంతుల వ్యవధిలో ఆర్సీబీ సారథి స్మృతి మంధాన (9), డేనియల్ వ్యాట్ (4)ను పెవిలియన్‌కు పంపింది. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన పెర్రీ, రఘ్వీ (25) గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. యువ పేసర్ కశ్వి గౌతమ్, తనూజా కన్వర్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డారు. డాటిన్ వేసిన 11వ ఓవర్లో నాలుగో బంతిని డీప్ స్కేర్ లెగ్ దిశగా సిక్సర్ కొట్టిన పెర్రీ.. డబ్ల్యూపీఎల్‌లో ఐదో అర్ధ సెంచరీని నమోదుచేసింది. కానీ ఇదే ఓవర్లో ఆఖరి బంతికి రఘ్వీ.. సయాలికి క్యాచ్ ఇవ్వడంతో 86 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. పెర్రీ కూడా సయాలీ 13వ ఓవర్లో లాంగాన్ వద్ద లారాకి చిక్కింది. కానీ రిచా ఆర్సీబీ పోరాటాన్ని కొనసాగించింది. గార్డ్నర్ 16వ ఓవర్లో 4, 6, 4, 4, 4తో 23 పరుగులు పిండుకుంది. డాటిన్ 17వ ఓవర్లో కనిక రెండు బౌండరీలతో 16 పరుగులు రాబట్టడంతో బెంగళూరు లక్ష్యానికి చేరువైంది. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రిచా.. ప్రియా మిశ్రా 18వ ఓవర్లో రెండు బౌండరీలు, భారీ సిక్సర్‌తో బెంగళూరు విజయాన్ని ఖాయం చేసింది.
గుజరాత్ ఇన్నింగ్స్‌లో మూనీ, గార్డ్నర్ ఆటే హైలైట్. ఆరంభంలో నెమ్మదిగానే ఆడిన మూనీ.. క్రీజులో కుదురుకున్నాక విజృంభించింది. మరో ఓపెనర్ లారా (6), హేమలత (4) విఫలమైనప్పటికీ.. ఆస్ట్రేలియా ద్వయం ఆర్సీబీ బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయింది. మొదటి టైమ్ ఔట్ సమయానికి 9 ఓవర్లలో గుజరాత్ చేసింది 53/2 పరుగులే. కానీ ఆ తర్వాత మూనీ, గార్డ్నర్ గేర్ మార్చారు. వర్హెమ్ 10వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్ కొట్టిన మూనీ 37 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదుచేసింది. కనిక బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదిన గార్డ్నర్.. ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మూనీ నిష్క్రమించినా డాటిన్ (13 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో రెచ్చిపోయి ఆడింది. ప్రేమ రావత్ 14వ ఓవర్లో ఆమె హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టగా వర్హెమ్ 15వ ఓవర్లో డాటిన్ మూడు బౌండరీలు బాదింది. 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేసిన గార్డ్నర్.. జోషిత 18వ ఓవర్లో మరో మూడు సిక్సర్లు కొట్టడంతో గుజరాత్ స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అజేయంగా నిలిచిన గార్డ్నర్ ఏకంగా 8 సిక్సర్లు బాదడం విశేషం.
1 డబ్ల్యూపీఎల్‌లో ఇదే అత్యధిక ఛేదన. గత ఎడిషన్‌లో ముంబై.. గుజరాత్‌పై 191 పరుగులను ఛేదించడమే ఇప్పటి దాకా అత్యుత్తమం.
2 ఈ టోర్నీలో రెండు వందల పరుగుల మార్కును అందుకోవడం గుజరాత్‌కు ఇది రెండోసారి. 2023 ఎడిషన్‌లోనూ బెంగళూరుపైనే (201/7) ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇది ఐదో అత్యుత్తమ స్కోరు.
గుజరాత్: 20 ఓవర్లలో 201/5 (గార్డ్నర్ 79 నాటౌట్, మూనీ 56, రేణుకా 2/25, అహుజా 1/19);
బెంగళూరు: 18.3 ఓవర్లలో 202/4 (రిచా 64 నాటౌట్, పెర్రీ 57, గార్డ్నర్ 2/33, డాటిన్ 1/41)