Rohit Sharma | సిడ్నీ: భారత స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మ..తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టత ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టులో అనూహ్యంగా తప్పించడంపై రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. గత కొన్ని రోజులుగా వస్తున్న వరుస కథనాలకు హిట్‌మ్యాన్ చెక్ పెట్టాడు. రెండో రోజు ఆటలో విరామం సందర్భంగా రోహిత్ వ్యాఖ్యాలతో మాట్లాడుతూ ‘నేను ఇప్పట్లో రిటైర్ కాను. ఫామ్‌లో లేను కాబట్టే చివరి టెస్టు నుంచి తప్పుకున్నాను. అంతేకానీ వేరే ఉద్దేశం లేదు. ఫామ్‌లో లేని ప్లేయర్‌ను ఏ జట్టు మోయలేదు. అందుకే నా స్థానంలో మెరుగైన ప్రదర్శన కనబరిచే ప్లేయర్ అవకాశం ఇచ్చారు.
ఇదే విషయాన్ని కోచ్, మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాను. అంతేకానీ రిటైర్ అవుతున్నట్లు కొందరు అదే పనిగా వార్తలు రాస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం సరైంది కాదు’ అని అన్నాడు. అయినా తాను ఇక్కడికి వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి కాదు ఆడటానికే. సిడ్నీ టెస్టు నుంచి వైదొలుగాలనే నిర్ణయం కఠినమైనదైనా..జట్టు అవసరాల కోసం ఇది తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘2007లో తొలిసారి డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మ్యాచ్ గెలువాలనే చెబుతుంటాను. కొన్నిసార్లు జట్టుకు ఏం అవసరమో మనం అర్థం చేసుకోవాలి. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మనం మారాల్సి ఉంటుం ది. ఫామ్‌లో లేకుండా జట్టులో కొనసాగడం సరైంది కాదు. జట్టుకు ఏది లాభిస్తుందో అది చేయాలి’అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
మరోవైపు పుకార్లపై స్పంది స్తూ ‘ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆలోచించే వ్యక్తిని కాదు. విమర్శల వల్ల కెప్టెన్సీ పద్ధతి మార్చుకోలేను. నా ఆట పై, కెప్టెన్సీపై ఎలాంటి అనుమానం లేదు. కెప్టెన్సీ విషయంలో పద్ధతి మార్చుకోవడం లేదు. కొన్నిసార్లు నిర్ణయాలు తప్పుకావచ్చు. బు మ్రా తర్వాత కెప్టెన్ ఎవరో ఇప్పుడే చెప్పలేను. కాలమే నిర్ణయిస్తుంది. చాలా మంది యువకులు క్యూలో ఉన్నారు. సీనియర్ల నుంచి నేర్చుకుంటూ వాళ్లు మరింత ముందుకు సాగాల్సి ఉంటుంది’ అని అన్నాడు. అయి నా భారత కెప్టెన్‌గా వ్యవహరించడం అంత సులువు కాదన్న రోహిత్..అదోక గౌరవంగా భావిస్తానని స్పష్టం చేశాడు.