Renuka Singh : ప్రపంచ కప్ ఛాంపియన్లుగా చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్లకు స్వరాష్ట్రంలో ఘన స్వాగతం లభిస్తోంది. విశ్వ విజేతగా నిలిచి దేశంతో పాటు రాష్ట్రాన్ని గర్వపడేలా చేసినందుకు వారికి నీరాజనాలు పడుతున్నారు జనం. అంతేకాదు సన్మానాలు, సత్కారాలతో బిజీగా గడిపేస్తున్నారు వరల్డ్ కప్ స్టార్స్. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్(Renuka Singh Thakur)కు హిమాచల్ ప్రదేశ్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ప్రపంచ కప్ విజయోత్సాహంలో ఉన్న ఆమె స్థానికంగా ఉన్న హతేశ్వరీ మాత ఆలయా (Hateshwari Mata Temple)న్ని దర్శించింది. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, గ్రామస్థులు ఆదివారం రేణుకను తమ సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు.
వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేణుకా సింగ్ హతేశ్వరీ మాత దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె తన తల్లి పడిన కష్టాలను గుర్తు చేసుకుంది. క్రికెటర్‌గా రాణించడంలో తనకు ఎంతో అండగా నిలిచిన ప్రతిఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ‘నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు మా అమ్మ సునీత పడిన కష్టాలు చాలానే. ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పేందుకు మాటలు రావడం లేదు.
#WATCH | Shimla, Himachal Pradesh: Cricketer Renuka Singh Thakur says, “I don’t have any words for my mother’s struggle. No amount of words can be enough to describe her struggle. I would like to give credit for this to everyone, my coaches and all the people who have helped… https://t.co/IKeyzQtGQY pic.twitter.com/ywEexvGhyE
— ANI (@ANI) November 9, 2025
నాన్న చనిపోయాక అన్ని తానై పెంచింది అమ్మ. మా కోసం ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది. నేను టీమిండియా తరఫున ఆడడం.. వరల్డ్ కప్‌లో రాణించడంలో అమ్మ, మా మేనమామ, కోచ్‌లు అందరి సహకారం ఉంది. అందుకే ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధాని మోడీలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆటల్ని బాగా ప్రోత్సహించాలి. అప్పుడే మరింత మంది ప్రతిభావంతులు విశ్వ వేదికలపై మెరుస్తారు’ అని రేణుక తెలిపింది.
#WATCH | Shimla, Himachal Pradesh: Villagers and local authorities felicitated Indian cricketer Renuka Singh Thakur on winning the ICC Women’s World Cup 2025. pic.twitter.com/hKEiwm35iz
— ANI (@ANI) November 9, 2025
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన రేణుకకు అన్నీ తల్లి సునీతనే అయింది. కూతురి ఇష్టాన్ని గ్రహించిన ఆమె క్రికెట్ అకాడమీలో చేర్పించింది. తల్లి కష్టాన్ని మరవని రేణుక.. జూనియర్ స్థాయిలో.. దేశవాళీలో గొప్పగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైంది. వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రధాన పేసర్ రేణుకా సింగ్ పవర్ ప్లేలో వికెట్ల వేటతో బ్రేకిచ్చింది. లీగ్ దశలో కీలకమైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 2\25తో మెరిసిన తను.. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో వికెట్ తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేసింది. ఇప్పటివరకూ 27 వన్డేలు ఆడిన రేణుక 41 వికెట్లు తీసింది. నాలుగు సార్లు 4 వికెట్లు తీసిన ఆమె.. ఒకేఒకసారి ఐదు వికెట్ల (5/29) ప్రదర్శన చేసింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిసి 100 వికెట్లు పడగొట్టింది పేస్ గన్.