బెంగళూరు: హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో తమ ఆటతో అభిమానులను అలరించాల్సిన కొందరు ఆటగాళ్లు సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్లతో అతి సన్నిహితంగా ఉంటున్నారు. కంటెంట్ క్రియెటర్లతో నిషిద్ధ ప్రాంతాల్లో రీల్స్ చిత్రీకరిస్తున్నారు. కొందరు అర్ధరాత్రుల్లో తమ హోటల్ గదుల్లోకి అపరిచిత వ్యక్తులను తీసుకొస్తుంటే.. మరికొందరు లేట్ నైట్ ఔటింగ్స్‌కు వెళ్లొస్తున్నారు. ఇలా ఐపీఎల్లో క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఆటగాళ్లు హద్దులు దాటి ప్రవర్తించడంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది.
హనీట్రాప్ ముప్పు ఉండటంతో ఆటగాళ్లు కట్టుతప్పకుండా కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆటగాళ్లు సన్నిహితంగా ఉండటం, నిషిద్ధ ప్రాంతాల్లో రీల్స్ చిత్రీకరించడంపై బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక యువ ఆటగాడు తన ఫ్రాంచైజీ కంటెంట్ టీమ్ సభ్యులతో కలిసి బౌండరీ లైన్ లోపల, ప్రాక్టీస్ సెషన్లలో వీడియోలు తీయడమే కాకుండా, తన హోటల్ గదిలో కూడా షూటింగ్ నిర్వహించడం కలకలం రేపింది.
అంతేకాకుండా ఆ రీల్స్‌ను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని చెప్పగా.. సదరు వ్లోగర్ ఆ వీడియోలు, ఫొటోలను తన సొంత అకౌంట్లో అప్లోడ్ చేసినట్టు గుర్తించింది. ఇక, ఆటగాళ్లు తమ హోదాను అడ్డుపెట్టుకుని భద్రతా నిబంధనలను బేఖాతరు చేయడంపై కూడా బీసీసీఐ దృష్టి సారించింది. ఒక సీనియర్ ఆటగాడు రాత్రిపూట తరచుగా అపరిచితులను తన గదికి పిలుచుకుంటున్నట్లు గుర్తించిన ఏసీయూ అధికారి ప్రశ్నించగా, సదరు టీమ్ మేనేజర్ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. మరికొందరు ఆటగాళ్లు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగడం, హోటల్ గదులకు ఆలస్యంగా రావడం వంటి ఘటనలు బోర్డును కఠిన నిర్ణయాల వైపు నడిపించాయి.
దాంతో ఆటగాళ్ల ప్రైవసీని గౌరవిస్తూనే, ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా చూడాలని ఫ్రాంచైజీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు కొత్త నిబంధనల అమలుకు సిద్ధమవుతున్నాయి. ఇకపై ఆటగాళ్లు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను కలవాలంటే టీమ్ మేనేజర్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. రాత్రి 10 గంటల తర్వాత గెస్టులను గదుల్లోకి ఆహ్వానించకూడదని, కేవలం లాబీ లేదా పబ్లిక్ ఏరియాల్లోనే సమావేశాలు జరగాలని నిబంధన విధించారు.