రాయ్‌పూర్: భారీ స్కోర్ల మ్యాచ్‌లతో విసిగిపోయిన ఐపీఎల్ అభిమానులకు ఆదివారం ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రాయ్‌పూర్‌లో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్ల ఉర్రూతలూగించింది. ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన పోరులో ఆర్సీబీ.. 2 వికెట్ల తేడాతో ముంబైని ఓడించి రెండు ఓటముల తర్వాత మళ్లీ గెలుపుబాట పట్టింది. స్వల్ప ఛేదనలో కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటంతో లక్ష్యాన్ని బెంగళూరు సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సాధించింది. మొదట భువనేశ్వర్ కుమార్ (4/23) బెంబేలెత్తించినా తిలక్ వర్మ (42 బంతుల్లో 57, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (32 బంతుల్లో 47, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా ముంబై.. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయింది.
భువీ విజృంభణతో మూడు ఓవర్లు ముగిసేసరికే 3 కీలక వికెట్లు కోల్పోయిన ముంబైని తిలక్, నమన్ ఆదుకున్నారు. తన మొదటి ఓవర్లోనే రికెల్టన్ (2)ను ఔట్ చేసిన భువనేశ్వర్.. మరుసటి ఓవర్లో రోహిత్ (22), సూర్యకుమార్నూ పెవిలియన్‌కు పంపి ముంబైకి షాకిచ్చాడు. ఈ క్రమంలో తిలక్, నమన్ జోడీ 10 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి ముంబైకి గౌరవప్రదమైన స్కోరును అందించింది. నెమ్మదిగా ఆడిన ఈ ద్వయం.. నాలుగో వికెట్‌కు 82 రన్స్ జోడించింది. రసిఖ్.. నమన్‌ను బౌల్డ్ చేయడంతో ముంబై కథ మళ్లీ మొదటికొచ్చింది. తిలక్, జాక్స్ (10) క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడలేకపోయారు.
స్వల్ప ఛేదనే అయినప్పటికీ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆర్సీబీ సైతం బెంబేలెత్తింది. దీపక్ చాహర్ వరుస ఓవర్లలో కోహ్లీని డకౌట్ చేయడంతో పాటు పడిక్కల్ (12)ను వెనక్కి పంపగా కార్బిన్ బాష్.. రజత్ పాటీదార్ (8)ను ఔట్ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. బెతెల్, కృనాల్ క్రీజులో ఉన్నా 12 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 94/3 మాత్రమే. ఆ మరుసటి ఓవర్లోనే బాష్.. బెతెల్ పనిపట్టి ఆ జట్టుపై ఒత్తిడితెచ్చే యత్నం చేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లో కృనాల్, జితేశ్ 16 రన్స్ రాబట్టి గేర్ మార్చారు. కృనాల్ అర్ధశతకం పూర్తయ్యాక బాష్ 16వ ఓవర్లో జితేశ్, డేవిడ్‌ను డగౌట్‌కు చేర్చి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశాడు.
చివరి 18 బంతుల్లో ఆ జట్టు విజయానికి 30 రన్స్ కావాల్సిన దశలో ఘజన్ఫర్ బౌలింగ్‌లో కవర్స్ వద్ద నమన్, తిలక్ సమన్వయ లోపంతో క్యాచ్ జారవిడిచారు. ఇదే అదునుగా కృనాల్.. రెండు సిక్స్‌లు బాదినా ఆఖరి బంతికి తిలక్కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 19వ ఓవర్లో బుమ్రా 3 పరుగులే ఇవ్వగా బవ.. షెఫర్డ్‌ను ఔట్ చేసి ముంబైలో ఆశలు రేపినా నాలుగో బంతిని భువీ సిక్స్‌గా మలవగా లాస్ట్‌బాల్‌కు రసిఖ్ (3*) రెండు రన్స్ తీసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ముంబై: 20 ఓవర్లకు 166/7 (తిలక్ 57, నమన్ 47, భువనేశ్వర్ 4/23, షెఫర్డ్ 1/18);
బెంగళూరు: 20 ఓవర్లకు 167/8 (కృనాల్ 73, బెతెల్ 27, బాష్ 4/26, చాహర్ 2/33)