బెంగుళూరు: ఈ యేటి ఐపీఎల్‌ను బెంగుళూరు జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పంజాబ్‌పై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ సందర్భాన్ని కర్నాటక ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. మద్యం తాగే క్రికెట్ అభిమానులు అయితే.. ఫుల్ జోష్‌తో నిండిపోయారు. మంళవారం ఒక్క రోజే కర్నాటకలో అత్యధిక స్థాయిలో మద్యం (Liquor Sales)అమ్ముడుపోయింది. లిక్కర్ సేల్స్ ద్వారా 157 కోట్లు ఆర్జించారు. జూన్ 3వ తేదీన ఒక్క రోజే సుమారు 1.48 లక్షల బీరు బాక్సులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆ మద్యం అమ్మకాల ద్వారా సుమారు 30.66 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో పాటు ఇతర మద్యం బాటిళ్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. బీర్లు కాకుండా ఇతర బాటిళ్లను సుమారు 1.28 లక్షల బాక్సుల సీసాలు వినియోగించినట్లు తెలుస్తోంది. వాటి మొత్తం విలువ సుమారు 127.88 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత ఏడాది ఇదే రోజున కర్నాటకలో కేవలం 0.36 లక్షల బీరు బాక్సులు మాత్రమే అమ్ముడుపోయాయి. అప్పుడు కేవలం 6.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి జూన్ మూడవ తేదీన కేవలం బీర్ల అమ్మకాలతో సుమారు 30.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఆల్కాహాల్ స్పిరిట్స్ సేల్ ద్వారా గత ఏడాది ఇదే రోజున 19.41 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే లిక్కర్ సేల్స్ ద్వారా సుమారు 157.94 కోట్లను ఆర్జించింది. గత ఏడాది జూన్ 3వ తేదీన అన్ని రకాల ఆదాయం మొత్తం కేవలం 25 కోట్లు మాత్రమే. అంటే ఈసారి ఒక్క రోజే 132.24 కోట్ల ఆదాయాన్ని అధికంగా ఆర్జించినట్లు తెలుస్తోంది.