బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కేక పుట్టిస్తున్నది. ఫ్యాన్స్ బేస్ పరంగా మిగతా జట్ల కంటే ముందంజలో ఉండే ఆర్సీబీ వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. ఆదివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యఛేదనలో రాయల్స్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్(34 బంతుల్లో 52, 7ఫోర్లు, సిక్స్), యశస్వి జైస్వాల్(47) రాణించగా, ఆఖర్లో ధృవ్ జురెల్ (16 బంతుల్లో 34 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. హర్షల్ పటేల్(3/32) మూడు వికెట్లు తీశాడు. అంతకముందు ఆర్సీబీ 20 ఓవర్లలో 189/9 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్(44 బంతుల్లో 77, 6ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్(39 బంతుల్లో 62, 8ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. బౌల్ట్(2/41), సందీప్(2/49) రాణించారు. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లీ(0) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన షాజాబ్ అహ్మద్(2) వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోగా, సూపర్ ఫామ్‌మీదున్న డుప్లెసిస్ మరోమారు బ్యాటు ఝుళిపించాడు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ 62/2 స్కోరు చేసింది. ఓవైపు డుప్లెసిస్ సాధికారికంగా ఇన్నింగ్స్‌ను కొనసాగించగా, మ్యాక్స్‌వెల్ రాయల్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లేలా మ్యాక్స్‌వెల్ నాటు కొట్టుడు కొట్టాడు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో భారీ సిక్స్‌తో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న మ్యాక్స్‌వెల్‌కు డుప్లెసిస్ జత కలువడంతో స్కోరుబోర్డు టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. కానీ ఆఖర్లో 50 పరుగుల వ్యవధిలో బెంగళూరు చివరి 7 వికెట్లు కోల్పోయింది.
రాయల్స్ పోరాడినా: లక్ష్యఛేదనలో రాయల్స్ కడదాకా పోరాడింది. బట్లర్(0) తొలి ఓవర్లోనే ఔట్ కాగా, యశస్వి జైస్వాల్, పడిక్కల్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. శాంసన్(22), హెట్‌మైర్(3) ఆకట్టుకోలేకపోయారు. జురెల్ ఒంటరి పోరాటం రాయల్స్‌ను గెలిపించలేకపోయింది
బెంగళూరు: 20 ఓవర్లలో 189/9(మ్యాక్స్‌వెల్ 77, డుప్లెసిస్ 62, బౌల్ట్ 2/41, సందీప్ 2/49), రాజస్థాన్: 20 ఓవర్లలో 182/6 (పడిక్కల్ 52, జైస్వాల్ 47, హర్షల్ పటేల్ 3/32, విల్లే 1/26)