RCB Vs GT | ఐపీఎల్లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న రాయస్థాన్ రాయల్స్‌కు గుజరాత్ టైటాన్స్ బ్రేకులు వేసింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆర్సీబీని గుజరాత్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆర్సీబీ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని జీటీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్ గిల్ సేన ఐపీఎల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌లో సాయి సుదర్శన్, జోస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్ రాణించడంతో గుజరాత్ రెండు వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకున్నది.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జీటీ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఒక దశలో 42 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోగా.. ఆర్సీబీని లివింగ్ స్టోన్ (54), జితేశ్ శర్మ (33) ఆదుకున్నారు. చివరలో టిమ్ డేవిడ్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడడంతో బెంగళూరు ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ఫిల్ సాల్ట్ (14), విరాట్ కోహ్లీ (7), దేవ్‌దత్ పడిక్కల్ (4), రజత్ పాటిదార్ (12), కృణాల్ పాండ్యా (5) పరుగులు మాత్రమే చేయగలిగారు. మహ్మద్ సిరాజ్‌కు మూడు వికెట్లు పడగొట్టగా.. సాయిసుదర్శన్కు రెండు, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మకు తలో వికెట్ దక్కింది.
బెంగళూరు నిర్దేశించి 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయిసుదర్శన్ శుభారంభం అందించారు. ఇద్దరు తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 14 బంతుల్లో ఒక ఫోర్, సిక్సర్‌తో 14 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సాయిసుదర్శన్, జోస్ బట్లర్ కలిసి గుజరాత్‌ను విజయం నడిపించారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 36 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్సర్ సహాయంతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
ఆ తర్వాత జోస్ బట్లర్ రూథర్ఫొర్డ్తో కలిసి గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. 39 బంతుల్లో (ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్ల)తో అజేయంగా 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రూథర్‌ఫొర్డ్ 18 బంతుల్లో మూడు సిక్సర్లు, ఫోర్ సహాయంతో 30 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు ఒకటి, జోష్ హాజిల్‌వుడ్ ఒక వికెట్ దక్కింది. ఇక ఈ విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానానికి చేరింది. ఆర్సీబీ మూడోస్థానానికి పడిపోగా.. పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉన్నది. రెండు విజయాలతో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల ఖాతాలో నాలుగేసి పాయింట్లు ఉండగా.. రన్‌రేట్ పరంగా మెరుగ్గా ఉండడంతో పంజాబ్ అగ్రస్థానంలో ఉన్నది. ఇక ఐపీఎల్లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కోల్‌కతా వేదికగా మ్యాచ్ జరుగనున్నది.