Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ‘ఇంప్యాక్ట్ ప్లేయర్’ నిబంధన ఎంత పాపులరో తెలిసిందే. జట్టు అవసరాన్ని బట్టి స్పెషలిస్ట్ బ్యాటర్ లేదంటే మిస్టరీ బౌలర్‌ను తీసుకొనే అవకాశాన్ని కల్పించే ఈ నియమాన్ని సద్వినియోగం చేసుకున్న ఆటగాళ్లు చాలామందే. పదహారో సీజన్లో ప్రవేశపెట్టిన ఈ రూల్‌ను ఉపయోగించుకొని పలువురు స్టార్ ఆటగాళ్లు ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగారు. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ సైతం 18వ ఎడిషన్‌లో ఇంప్యాక్ట్గా ఆడాడు. కానీ, భారత స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి మాత్రం ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా రావడం అస్సలు నచ్చదట. ఈ విషయాన్ని రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు స్వస్తిక్ చికరా (Swastik Chikara) వెల్లడించాడు.
అథ్లెట్‌ను తలపించే విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్. మైదానంలో చిరుతలా కదిలే అతడు.. బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో ఆడినంత కాలం, చెక్కుచెదరని దేహధారుఢ్యం ఉన్నన్ని రోజులు తాను ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడడానికి ఏమాత్రం ఇష్టముండదని తనతో కోహ్లీ చెప్పాడని రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో స్వస్తిక్ పేర్కొన్నాడు. ‘ఓసారి విరాట్ భయ్యాతో మాట్లాడాను. అప్పుడు అతడు తనకు క్రికెట్ మీదున్న ఫ్యాషన్ వెల్లడించాడు. నేను ఫిట్‌గా ఉన్నంత వరకూ క్రికెట్ ఆడుతా. ఆడినన్ని రోజులు సింహంలా గర్వంగా, రాజసంగా మైదానంలోకి దిగుతాను.
SWASTIK CHIKARA ON VIRAT KOHLI & HIS GREATNESS
– “Virat bhaiya ne bola tha ‘Jab Tak Cricket Khelunga sher ki Tarah khelunga, Kabhi Impact player Tarah nhi khelunga (Virat bhaiya had said As long as I play cricket, I’ll play like a lion, never play like an impact player)”. pic.twitter.com/FO8l1aAgE9
— Saurabh Shelar ™ (@Saurabh_Shelar_) August 22, 2025
అంతే తప్ప ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా మాత్రం ఆడబోను. పొట్టి ఫార్మాట్లో నేను 20 ఓవర్లు ఫీల్డింగ్ చేయగలను. ఆ తర్వాత బ్యాటింగ్ చేయగలను. ఒకవేళ నేను ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా ఆడాల్సి వచ్చిన రోజున క్రికెట్‌ను వదిలేస్తాను. కానీ, ఇంప్యాక్ట్ ప్లేయర్ మాత్రం అనిపించుకోను అని నాతో అన్నాడు. విరాట్ మాటలు విన్నాక అతడిని అందరూ ఛాంపియన్ ప్లేయర్ అని ఎందుకు అంటారో అర్ధమైంది’ అని స్వస్తిక్ చెప్పాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన జట్టుకు ట్రోఫీ అందించి మురిసిపోయాడు. ఎప్పటిలానే పద్దెనిమిదో సీజన్లో ‘ఈసాలా కప్ నమదే’ అనే స్లోగన్‌తో మైదానంలోకి దిగిన ఆర్సీబీ తొలిసారి విజేతగా అవతరించింది. ఓపెనర్‌గా శుభారంభాలు ఇస్తూ.. జట్టు విజయాల్లో కీలకమైన విరాట్ 15 మ్యాచుల్లో 657 రన్స్‌తో రాణించాడు. ఐపీఎల్ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ వన్డేల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈమధ్యే లండన్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తున్న ఫొటోలను పంచుకున్న రన్ మెషీన్.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో ఉంటాడో? లేదో చూడాలి.