బెంగళూరు: ఐపీఎల్-18లో సమిష్టి ప్రదర్శనతో టైటిల్ రేసులో ఒకటిగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో ఇప్పటివరకూ బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషించిన స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమవనున్నట్టు తెలుస్తున్నది.
ఈనెల 3న చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు భుజం గాయంతో తప్పుకున్న హాజిల్‌వుడ్.. బీసీసీఐ ఈ లీగ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేయడంతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ ఆసీస్ పేసర్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోగా వచ్చేనెలలో ఆ జట్టు.. దక్షిణాఫ్రికాతో కీలకమైన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడనున్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అతడిపై రిస్క్ తీసుకోదలుచుకోకూడదన్న అభిప్రాయంలో ఉంది. దీంతో అతడు తిరిగి రావడం కష్టమేనని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి.