బెంగళూరు : ఐపీఎల్లో అత్యంత ప్రజాధరణ కల్గిన జట్లలో ఒకటిగా పేరున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని అమ్మేస్తున్నారా? ఈ లీగ్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతూ ఎట్టకేలకు గత సీజన్లో ట్రోఫీ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీని అమ్మేందుకే యాజమాన్యం మొగ్గుచూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రస్తుతం బెంగళూరు ఓనర్లుగా ఉన్న డియాగొ గ్రూప్ (యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్) తమ వాటాలను పూర్తిగా విక్రయించేందుకు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
‘క్రిక్‌బజ్’లో వచ్చిన కథనం మేరకు.. ఆర్సీబీని దక్కించుకోవడానికి ఆరు బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తున్నది. వాటిలో ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సహ యజమానిగా ఉన్న జిందాల్ గ్రూప్‌తో పాటు అదానీ గ్రూప్, అదర్ పూనావాలా (సీరమ్ ఇన్స్టిట్యూట్), యూఎస్‌కు చెందిన రెండు ఈక్విటీ కంపెనీలు, ఢిల్లీకి చెందిన ఓ బిలియనీర్ రేసులో ఉన్నట్టు వినికిడి. ఆర్సీబీ మార్కెట్ వాల్యూను డియాగొ 2 యూఎస్ బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 17,859 కోట్లు)గా నిర్ణయించినట్టుగా సమాచారం.