IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఉత్కంఠ పోరాటాలు, అనూహ్యమైన ఫలితాలు అభిమానులను అలరిస్తున్నాయి. సీజన్ మొదలై వారం రోజులు కావొస్తుంది. ప్రతి మ్యాచ్‌లో తగ్గపోరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో కీలక మ్యాచ్‌కు తెరలేవనుంది. చెపాక్ స్టేడియం వేదికగా ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తలపడనుంది. దాంతో, అభిమానులు చిరకాల ప్రత్యర్థులుగా భావించే ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి నెలకొంది. అందుకు కారణం.. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 17 ఏళ్లుగా చెన్నై చేతిలో ఓడిపోతూనే ఉంది.
అవును.. చిదంబరం స్టేడియం సీఎస్కేకు కంచుకోటలాంటిది. టర్నింగ్ పిచ్ మీద ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడం చెన్నైకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ మైదానంలో సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించడం ఏ జట్టుకైనా అతిపెద్ద సవాల్. ఐపీఎల్ సీజన్ 2008లో మొదలైనప్పటి నుంచి చెపాక్‌లో సీఎస్కే విజయాలు సాధిస్తూనే వస్తోంది. చివరిసారిగా 2008లో ఆర్సీబీ జయభేరి మోగించింది.
Come one and come all 🥳
Bring out the whistles 💛 and bring out the cheers ❤
It’s time for the Southern Derby 🔥@ChennaiIPL 🆚 @RCBTweets #TATAIPL | #CSKvRCB pic.twitter.com/RiX1ZFdqov
— IndianPremierLeague (@IPL) March 28, 2025
అప్పుడు రాహుల్ ద్రవిడ్ కెప్టెన్. బెంగళూరు నిర్దేశించిన 127 పరుగుల ఛేదనలో చెన్నై 8 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసిందంతే. ఆ తర్వాత 16 ఎడిషన్లలో ఇరుజట్లు చెపాక్‌లో తలపడ్డాయి. కానీ, ప్రతిసారి బెంగళూరును పరాజయమే పలకరించింది. మొత్తంగా చూసినా సరే ఆర్సీబీపై సీఎస్కేదే పైచేయి. ఇప్పటివరకూ రెండుజట్లు 33 సార్లు ఢీకొనగా.. సూపర్ కింగ్స్ 21 పర్యాయాలు, ఆర్సీబీ 11సార్లు గెలుపొందాయి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రతి సీజన్లోనూ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. ఎందుకంటే.. ఆ జట్టులో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. కూల్‌గా ఉండే మహీ మార్క్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా, అశ్విన్… వంటి స్పిన్నర్లు తోడవ్వడంతో సీఎస్కే ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చేది కాదు. నిరుడు ధోనీ సారథిగా వైదొలిగినా ఇంకా వికెట్ కీపర్‌గా సేవలందిస్తున్నాడు.
మైదానంలో అతడు ఉండగా చెపాక్‌లో ఏ జట్టుకైనా కొండంత స్కోర్ కొట్టడం.. స్వల్ప లక్ష్యాన్ని అయినా ఛేదించడం కత్తిమీదసామే. ప్రస్తుతం చెన్నైకి జడ్డూ, అశ్విన్‌లతో పాటు కుర్రాడు నూర్ అహ్మద్ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ గైక్వాడ్‌లు తొలి పోరులో ముంబై ఇండియన్స్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 155 పరుగుల ఛేదనలో అర్థ శతకాలతో చెలరేగి జట్టును గెలిపించారు ఇద్దరు.
ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచి బెంగళూరుకు విరాట్ కోహ్లీ వెన్నెముకలా నిలుస్తున్నాడు. కెప్టెన్‌గా జట్టును ఓసారి ఫైనల్ చేర్చిన విరాట్ ట్రోఫీ సాధించలేకపోయాడు. 18వ సీజన్లో తమ జట్టుకు టైటిల్ కట్టబెట్టాలనే కసితో ఉన్నాడు కింగ్ కోహ్లీ. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ.. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఉత్కంఠ విజయం నమోదు చేసింది. చెన్నైపై కూడా గెలుపొందితే బెంగళూరు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.