రెండు రోజులుగా పరుగుల వరద పారిన ఐపీఎల్లో.. సోమవారం వికెట్ల వేట జోరుగా సాగింది. మేఘావృతమైన వాతావరణంలో వరుణుడి అంతరాయం మధ్య జరిగిన పోరులో బౌలర్లు పండగ చేసుకున్నారు. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరును సాధారణ స్కోరుకే పరిమితం చేసిన లక్నో.. ఆనక స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. దీంతో గత మ్యాచ్‌లో లక్నో చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న ఆర్సీబీ ఐదో విజయం అందుకుంది.
లక్నో: బౌలర్ల హవా సాగిన పోరులో బెంగళూరుదే పైచేయి అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్లు డుప్లెసిస్ (40 బంతుల్లో 44; ఒక ఫోర్, ఒక సిక్సర్), విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నెమ్మదిగా ఆడిన కోహ్లీ.. డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించిన అనంతరం ఔట్ కాగా.. ఆ తర్వాత ఏ దశలోనూ బెంగళూరు ఇన్నింగ్స్ కోలుకోలేకపోయింది. మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో పిచ్ బౌలర్లకు సహకరించగా.. బెంగళూరు బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయంటే మ్యాచ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.5 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. కృష్ణప్ప గౌతమ్ (13 బంతుల్లో 23; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మయేర్స్ (0), బదోనీ (4), కృనాల్ పాండ్యా (14), దీపక్ హుడా (1), పూరన్ (9), స్టోయినిస్ (13) విఫలమయ్యారు. గాయం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయలేకపోవడం లక్నో విజయావకాశాలపై ప్రభావం చూపింది. బెంగళూరు బౌలర్లలో కరణ్ శర్మ, హజిల్‌వుడ్ రెండేసి వికెట్లు తీశారు. డుప్లెసిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
రాహుల్‌కు గాయం
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరు ఇన్నింగ్స్ రెండో ఓవర్లో డుప్లెసిస్ ఎక్స్ట్రా కవర్స్ వైపు కొట్టిన బంతిని ఆపే క్రమంలో రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి తొడ పట్టేయడంతో మైదానంలో కూప్పకూలిన రాహుల్.. ఫిజియో సహాయంతో స్టేడియాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా క్రీజులోకి వచ్చిన రాహుల్ పరిగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 126/9 (డుప్లెసిస్ 44, కోహ్లీ 31; నవీన్ 3/30, బిష్ణోయ్ 2/21), లక్నో: 19.5 ఓవర్లలో 108 ఆలౌట్ (గౌతమ్ 23, మిశ్రా 19; కరణ్ 2/20, హజిల్‌వుడ్ 2/15).