RCB | ఢిల్లీ: ఐపీఎల్-18లో ప్రత్యర్థులను వారి సొంతవేదికల్లో చిత్తు చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. మరో థ్రిల్లింగ్ విక్టరీతో అదరగొట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన బెంగళూరు.. ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానాన నిలవడమే గాక ప్లేఆఫ్స్ రేసులో మిగిలిన జట్ల కంటే ముందే బెర్తును ఖరారు చేసుకుంది. క్యాపిటల్స్ నిర్దేశించిన 163 పరుగులు ఛేదనను ఆ జట్టు.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ (47 బంతుల్లో 73*, 5 ఫోర్లు, 4 సిక్స్‌లు; 1/28) మెరుపులకు తోడు విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51, 4 ఫోర్లు) మరో అర్ధశతకంతో మెరిశాడు. మొదట బెంగళూరు బౌలర్లు భువనేశ్వర్ (3/33), హాజిల్‌వుడ్ (2/36) కట్టడి చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగుల స్కోరుచేసింది. కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడగా ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34, 5 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించాడు.
26/3. మోస్తరు ఛేదనలో 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరిది. అక్షర్.. ఒకే ఓవర్లో బెతెల్ (12) తో పాటు పడిక్కల్ (0)ను ఔట్ చేయగా మిడ్ వికెట్ వద్ద కరుణ్ మెరుపు త్రో తో రజత్ పటీదార్ (6) రనౌట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్.. కోహ్లీతో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 12 ఓవర్లకూ ఆర్సీబీ స్కోరు 78/3గానే ఉంది.
ఈ జోడీ సింగిల్స్‌కే పరిమితమైనా స్ట్రైక్ రొటేట్ చేస్తూ నిలకడగా ఆడింది. కానీ ముకేశ్ 13 ఓవర్ నుంచి కృనాల్ గేర్ మార్చాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు.. కుల్దీప్ ఓవర్లోనూ ఓ సిక్స్ కొట్టాడు. అక్షర్ బౌలింగ్‌లో బౌండరీతో కృనాల్ అర్ధ శతకం పూర్తయింది. కోహ్లీ కూడా వరుసగా మూడో హాఫ్ సెంచరీ (ఈ సీజన్లో ఆరోది)ని నమోదుచేశాడు. బెంగళూరు విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లీ నిష్క్రమించినా కృనాల్, డేవిడ్ (19*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెరుపు ఆరంభమే దక్కినా తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. అభిషేక్ పొరెల్ (11 బంతుల్లో 28, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. కానీ మరో ఎండ్‌లో డుప్లెసిస్ (22) మాత్రం స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. హాజిల్‌వుడ్ నాలుగో ఓవర్లో పొరెల్‌ను ఔట్ చేయగా మరుసటి ఓవర్లో యశ్ దయాల్.. కరుణ్ నాయర్ (4)ను పెవలియన్‌కు పంపాడు. డుప్లెసిస్‌తో రాహుల్ జతకలిసినా ఈ ద్వయం వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. రాహుల్ అయితే బంతికో పరుగు అన్నట్టుగానే ఆడాడు.
కృనాల్.. 10వ ఓవర్లో డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. క్రీజులోకి రాగానే ఓ సిక్స్, ఫోర్ కొట్టిన అక్షర్.. హాజిల్‌వుడ్ 14వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. భువీ 17వ ఓవర్లో రాహుల్‌తో పాటు అశుతోశ్ శర్మ (2)ను ఔట్ చేసి ఢిల్లీ భారీ స్కోరు ఆశలకు గండికొట్టాడు. కానీ ఆఖర్లో స్టబ్స్.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో 4, 4తో పాటు దయాల్ 19వ ఓవర్లో ఓ సిక్స్, రెండు బౌండరీలతో ఢిల్లీ పోరాడే స్కోరును సాధించింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 162/8 (రాహుల్ 41, స్టబ్స్ 34, భువనేశ్వర్ 3/33, హాజిల్‌వుడ్ 2/36);
బెంగళూరు: 18.3 ఓవర్లలో 165/4 (కృనాల్ 73*, కోహ్లీ 51, అక్షర్ 2/19, చమీర 1/24)