T20 World Cup 2024 : అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ప్రకటించింది. సీనియర్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ (Rashid Khan) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని బుధవారం సెలెక్టర్లు వెల్లడించారు. ఐసీసీ టోర్నీల్లో సెమీస్ కూడా చేరని నేపథ్యంలో ఈసారి పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు.
గెలుపు గుర్రాలైన ఆల్రౌండర్లకు పెద్ద పీట వేస్తూ ఏకంగా ఆరుగురికి తుది బృందంలో చోటు కల్పించారు. నిరుడు సెంట్రల్ కాంట్రాక్ట్ వివాదంతో వార్తల్లో నిలిచి ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్‌లకు సైతం వరల్డ్ కప్ బెర్తు దక్కింది.
🚨 SQUAD ANNOUNCEMENT!🚨
Here’s AfghanAtalan’s Squad for the ICC Men’s T20I World Cup 2024. 🤩#AfghanAtalan | #T20WorldCup pic.twitter.com/M7oTF8ZPaa
— Afghanistan Cricket Board (@ACBofficials) April 30, 2024
అఫ్గనిస్థాన్ స్క్వాడ్ : రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహమ్మద్ ఇషాక్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నయీబ్, కరిమ్ జనత్, రషీద్ ఖాన్(కెప్టెన్), నన్గ్యాల్ ఖరొటి, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్.
రిజర్వ్ ఆటగాళ్లు : సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.
పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అఫ్గనిస్థాన్ ఆ ముద్ర నుంచి బయటపడింది. మెగా టోర్నీల్లో సంచలన విజయాలతో చరిత్ర సృష్టించిన కాబూలీలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే.. ఆ జట్టులో రషీద్, నబీ, ముజీబ్ రూపంలో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. నిరుడు భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గన్ జట్టు అదరగొట్టింది.
మాజీ చాంపియన్ల (ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్)కు షాకిచ్చి వారెవ్వా అనిపించింది. జూన్‌లో మొదలయ్యే పొట్టి ప్రపంచకప్‌లో రషీద్ సేన మరిన్ని సంచలనాలు నమోదు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1న షురూ కానుంది. తొలిపోరులో అఫ్గనిస్థాన్ జూన్ 4వ తేదీన పసికూన ఉగాండా(Uganda)తో తలపడనుంది.