Rashid Khan : స్వదేశంలో ఎవరైనా స్వేచ్ఛగా తిరుగుతారు. పుట్టిపెరిగిన చోటులో తమ భద్రత గురించి పెద్దగా ఆందోళన చెందరు. కానీ, తాలిబన్ రాజ్యం నడుస్తున్న అఫ్గనిస్థాన్ (Afghanistan)లో మాత్రం ఎక్కడి నుంచి ఏ బాంబ్ మీద పడుతోందో తెలియదు. అందుకే.. తమకు బుల్లెట్ ప్రూఫ్ కార్లే దిక్కు అంటున్నాడు రషీద్ ఖాన్ (Rashid Khan). ఇటీవల ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pieterson)తో ఒక ఇంటర్వ్యూలో తమ దేశంలోని పరిస్థితుల గురించి సంచలన విషయాలు వెల్లడించాడీ కెప్టెన్.
ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన రషీద్ ఖాన్ అఫ్గనిస్థాన్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాడు. ‘కేపీదస్విచ్’ అనే ఇంటర్వ్యూలో పీటర్సన్ మీ దేశంలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువా?,అఫ్గనిస్థాన్‌లో మీ జీవితం ఎలా ఉంటుంది? కాబూల్ వీధుల్లో జాలీగా తిరుగుతారా? అని అని పీటర్సన్ అడిగిన ప్రశ్నకు రషీద్ కూల్‌గా బదులిచ్చాడు. ‘నో ఛాన్స్. నేను మా దేశంలో స్వేచ్ఛగా తిరగలేను. మీ అందరిలా సాధారణ కారు ఉపయోగించలేను. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండాల్సిందే. ప్రతిసారి నేను నా ఈ కారులోనే ప్రయాణిస్తాను’ అని తెలిపాడు.
నన్ను లక్ష్యంగా చేసుకొని కాల్పలు జరుపుతారని కాదు. ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉన్న స్థలలో ఉండే అవకాశముంది. అందుకే.. తుపాకీ గుళ్లను తట్టుకునేలా కారును డిజైన్ చేయించుకున్నాను. మీకు ఇది కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ, నాలానే మాదేశంలో చాలామంది తమ భద్రతకు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో ప్రయాణిస్తుంటారు. చెప్పాలంటే మా దేశంలో ఇది చాలా సాధారణ విషయం’ అని రషీద్ పేర్కొన్నాడు. వరల్డ్ నంబర్ 1 బౌలర్‌గా అఫ్గనిస్థాన్ పేరును విశ్వవ్యాప్తం చేసిన రషీద్.. ఎక్కువగా దుబాయ్‌లోనే నివసిస్తుంటాడు. ఇక క్రికెట్ విషయానికొస్తే.. ‘భారత్‌లో మాదిరిగానే మాదేశంలోనూ ఈ ఆట అంటే క్రేజ్. అంతర్జాతీయ మ్యాచ్ జరగాలనే గానీ జనం స్టేడియంలో నిండిపోతారు. వాళ్లను నియంత్రించలేం’ అని వివరించాడు రషీద్.
మిస్టరీ స్పిన్నర్ రషీద్ టీ20ల్లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్. అందుకే అతడిపై ఫ్రాంచైజీ జట్లు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, ది హండ్రెడ్ లీగ్‌లో ఆడుతున్న రషీద్.. ప్రస్తుతం ఆదేశ టీ20 జట్టు కెప్టెన్. నిరుడు సెమీస్ ఆడిన అఫ్గన్ టీమ్‌ను.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పొట్టి కప్‌లో టైటిల్ లక్ష్యంగా ముందుకు నడిపిస్తున్నాడు రషీద్. నిరుడు అక్టోబర్ పెళ్లి చేసుకున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇటీవలే రెండోసారి మనువాడిన విషయం తెలిసిందే.