న్యూఢిల్లీ: దేశవాళీ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ ఎట్టకేలకు మొదలుకాబోతున్నది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లుగా నిలిచిపోయిన రంజీ టోర్నీ ఈనెల 16 నుంచి మొదలుకానుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తొలి దశలో ఈనెల 16 నుంచి మొదలై మార్చి 5 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. వాస్తవానికి గత జనవరి 13 నుంచి మొదలు కావాల్సి ఉన్నా.. కరోనా మూడోదశ వ్యాప్తితో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని మొత్తం 38 జట్ల కోసం తొమ్మిది వేర్వేరు వేదికల్లో బయోబబుల్ ఏర్పాట్లు చేయబోతున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, కోల్‌కతా, తివేండ్రమ్, కటక్, చెన్నై, గువాహటి, బరోడా, రాజ్‌కోట్ ఉన్నాయి. నాలుగేసి జట్లతో 8 గ్రూపులుగా విభజించి ప్లేట్ గ్రూపులో ఆరు జట్లకు చోటు కల్పించనున్నారు. దీంతో లీగ్‌లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుంది. తదుపరి దశకు అర్హత సాధించడంలో విఫలమయ్యే జట్టు మూడు మ్యాచ్‌లకే పరిమితం కావాల్సి ఉంటుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత జూన్‌లో నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది. అయితే బయోబబుల్ వాతావరణం కల్పించడం బీసీసీఐకి కత్తిమీద సాము అయ్యే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే రంజీ ట్రోఫీ కోసం ప్లేయర్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సౌరాష్ట్ర స్టార్ ప్లేయర్ షెల్టన్ జాక్సన్ చెప్పుకొచ్చాడు.