నాగ్‌పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ముగింపు దశకు చేరింది. సోమవారం నుంచి ఈ సీజన్లో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. సీజన్లో పడుతూ లేస్తూ సెమీస్ చేరిన డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై.. కీలకపోరులో విదర్భతో తలపడనుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ (నాగ్‌పూర్) ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. క్వార్టర్స్‌లో హర్యానాతో తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా లోయరార్డర్ బ్యాటర్ల సాయంతో గట్టెక్కిన ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్మురేపింది. కెప్టెన్ అజింక్యా రహానే, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే వంటి స్టార్లు ఆ జట్టుకు అదనపు బలం. సిద్ధేశ్ లాడ్, తనూష్ కొటియాన్ ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. విదర్భ కరుణ్ నాయర్, యశ్ రాథోడ్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, అథర్వ తైడేపై భారీ ఆశలే పెట్టుకుంది. ఇక మరో సెమీస్ గుజరాత్, కేరళ మధ్య జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.