హైదరాబాద్, ఆట ప్రతినిధి: యూఎఫ్‌సీ చాంపియన్ అంథోనీ పెట్టిస్ ఫైట్క్లబ్తో ప్రముఖ తెలుగు సినీ నటుడు దగ్గుబాటి రానా జతకట్టాడు. తన స్పిరిట్ మీడియా ఫౌండర్‌కు చెందిన బాక్సింగ్ బే ద్వారా..అంథోనీ పెట్టిస్ పైట్క్లబ్(ఏపీఎఫ్సీ)తో గురువారం భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్(డబ్ల్యూబీసీ)కి చెందిన ప్రతినిధులు ఆస్కార్ విల్లే, ఎరికా కాంటెరస్ హాజరయ్యారు. ఈ ఏడాది తర్వాత రెండు మేజర్ బాక్సింగ్ ఈవెంట్లలో ఒకటి అమెరికాలో, మరొకటి భారత్‌లో భారీస్థాయిలో నిర్వహించబోతున్నారు. భారత్‌లో బాక్సింగ్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నామని, ఏపీఎఫ్సీతో భాగస్వామ్యం ద్వారా దేశంలో నూతన ఒరవడి తీసుకొస్తామని రానా పేర్కొన్నాడు.
బీసీ రాయ్ ఫుట్‌బాల్ చాంప్ తెలంగాణ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: నాగోన్(అస్సాం) వేదికగా జరిగిన బీసీ రాయ్ ఫుట్‌బాల్ చాంపియన్సిప్లో తెలంగాణ బాలుర జూనియర్ జట్టు విజేతగా నిలిచింది. తెలంగాణ, మణిపూర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు నిర్ణీత సమయంలో 1-1తో డ్రాగా ముగిసింది. అయితే విజేతను నిర్ణయించేందుకు జరిగిన పెనాల్టీ షూటౌట్లో తెలంగాణ 4-3తో మణిపూర్‌పై విజయాన్నందుకుంది. యఫబా, ఫైజాన్, సాజిద్, ఒమర్ ఫారుఖ్ తెలంగాణ తరఫున గోల్స్ చేశారు. టైటిల్ విజేతగా నిలిచిన జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గుణ అభినందించారు.
యమాల్ తండ్రిపై హత్యాయత్నం
బార్సిలోనా: ఫుట్‌బాల్ యువ సంచలనం, ఇటీవలే యూరో కప్ నెగ్గిన స్పెయిన్ జట్టులోని ఆటగాడు లమినె యమాల్ తండ్రి మోనిర్ నస్రోయ్ హత్యాయత్నానికి గురయ్యాడు. బుధవారం ఆయనపై గుర్తుతెలియని దుండగులు దాడికి దిగినట్టు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఓ కథనంలో పేర్కొంది. హత్యాయత్నం జరిగిన వెంటనే మోనిర్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.