హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుసేన్సాగర్ వేదికగా జరుగుతున్న యూత్ రెగెట్టా చాంపియన్‌షిప్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. పోటీల మూడో రోజు యువ సెయిలర్ మహమ్మద్ రిజ్వాన్ సత్తాచాటాడు. బాలుర అప్టిమిస్టిక్ మెయిన్ఫ్లీట్ విభాగంలో రిజ్వాన్ పసిడి పతకంతో మెరిశాడు. టోర్నీలో మొదటి నుంచే తనదైన జోరు కనబరుస్తున్న రిజ్వాన్ మరో రేసు మిగిలుండగానే అగ్రస్థానం దక్కించుకున్నాడు.
రెండో స్థానం కోసం బిన్నీ, ఆకాశ్‌కుమార్ మధ్య గట్టిపోటీ నెలకొన్నది. బాలికల విభాగంలో తెలంగాణ సెయిలింగ్ అకాడమీకి చెందిన షేక్ రమీజ్భాను, శ్రింగేరి రాయ్‌పై పాయింట్ ఆధిక్యంలో నిలిచి ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఐల్సీఏ 4 కేటగిరీలో నేవీ యాచ్ క్లబ్‌కు చెందిన రమాకాంత్ ఆరు పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా, బాలికల విభాగంలో అస్తా పాండే టాప్‌లో కొనసాగుతున్నది.