కండ్ల ముందు భారీ లక్ష్యం కనిపిస్తున్నా.. ఏ మాత్రం అదరక బెదరక ముందుకు సాగిన రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. తొలి బంతి నుంచే చెన్నైపై విరుచుకుపడిన రాజస్థాన్ ఐదో విజయంతో తాము కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నామని చాటింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అజేయ శతకం వృథా కాగా.. రాజస్థాన్ తరఫున జైస్వాల్, శివం దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బంతిపై పగ పట్టినట్లు.. బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు.. ఊచకోతకు దిగి జాయెద్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు.
అబుదాబి: యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో పరుగుల వరద పారింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో అదగొడితే.. రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శివం దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అంతకుమించిన విధ్వంసం సృష్టించారు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రుతురాజ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ దంచికొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రాజస్థాన్ 81 పరుగులు చేసింది. ఆ తర్వాత శాంసన్ (28), దూబే కూడా ఇదే జోరు కొనసాగించడంతో రాయల్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ (0/55), జోస్ హజిల్‌వుడ్ (0/54) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 189/4 (గైక్వాడ్ 101 నాటౌట్, జడేజా 32 నాటౌట్; తెవాటియా 3/39), రాజస్థాన్: 17.3 ఓవర్లలో 190/3 (శివం 64 నాటౌట్, జైస్వాల్ 50; శార్దూల్ 2/30).