గడిచిన 16 సీజన్లుగా ఊరిస్తున్న ట్రోఫీ దక్కించుకోవడంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 17వ సారీ తడబడింది. రాజస్థాన్ రాయల్స్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన ‘ఎలిమినేటర్’ పోరులో ఓడింది. ప్లేఆఫ్స్ చేరడానికి ఒక్క శాతం అవకాశం ఉన్నా దానిని రెండు చేతులా ఒడిసిపట్టుకుని అద్భుత పోరాటంతో నాకౌట్ దశకు వచ్చిన బెంగళూరు.. మరోసారి ఒత్తిడికి చిత్తై ఖాళీ చేతులతో వెనుదిరిగింది. గత 4 మ్యాచ్‌లలో ఓడిన రాజస్థాన్.. కీలక పోరులో జూలు విదిల్చింది. సమిష్టిగా రాణించి క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మరో కీలకపోరుకు సిద్ధమైంది. ఓటమితో ఆర్సీబీ మరోసారి ‘ఈ సాలా కప్ నమ్మదల్ల’ (ఈసారి కూడా కప్ మనది కాదు) అంటూ నిరాశగా వెనుదిరిగింది.
అహ్మదాబాద్: ఐపీఎల్ ప్రతి సీజన్‌కు ముందు ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ హంగామా చేసే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కీలకమైన ‘ఎలిమినేటర్’ పోరులో రాజస్థాన్ రాయల్స్ సమిష్టిగా రాణించి బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల ఛేదనలో తడబడ్డా యశస్వీ జైస్వాల్ (30 బంతుల్లో 45, 8 ఫోర్లు), రియాన్ పరాగ్ (26 బంతుల్లో 36, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. అవేశ్ ఖాన్ (3/44), అశ్విన్ (2/19), బౌల్ట్ (1/16) కట్టడిచేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో రజత్ పాటిదార్ (22 బంతుల్లో 34, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 33, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్ కూడా 35 పరుగుల మార్కును దాటకపోవడం ఆ జట్టు భారీ స్కోరు అవకాశాలను భారీగా దెబ్బతీసింది. సారథి ఫాఫ్ డుప్లెసిస్ (17) మరోసారి నిరాశపరచగా బెంగళూరు భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీ ఉన్నంతసేపు ఫర్వాలేదనిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. సందీప్‌శర్మ 5వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీని చాహల్ 8వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన కామెరూన్ గ్రీన్ (27) తో పాటు మ్యాక్స్‌వెల్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అశ్విన్.. ఆర్సీబీని దెబ్బతీశాడు. ఐదు పరుగుల వద్ద జురెల్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన పాటిదార్ ఆదుకునే యత్నం చేసినా 15వ ఓవర్లో అవేశ్ ఖాన్ అతడి ఆట కట్టించాడు. దినేశ్ కార్తీక్ (11) సైతం అవేశ్ బౌలింగ్‌లోనే జైస్వాల్ చేతికి చిక్కాడు. ఆఖర్లో మహిపాల్ లోమ్రర్ (17 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి బెంగళూరుకు పోరాడే స్కోరును అందించాడు.

మోస్తరు ఛేదనను రాజస్థాన్ ధాటిగానే ఆరంభించింది. జైస్వాల్, కోహ్లర్ (15 బంతుల్లో 20, 4 ఫోర్లు) ఆది నుంచే బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగి తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. యశ్ దయాల్ 3వ ఓవర్లో జైస్వాల్ నాలుగు బౌండరీలు బాదగా సిరాజ్ 4వ ఓవర్లో కోహ్లర్ 2 ఫోర్లు సాధించాడు. బౌలింగ్ మార్పుగా వచ్చిన ఫెర్గూసన్.. 6వ ఓవర్లో మూడో బంతికి కోహ్లర్‌ను బౌల్డ్ చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (17)తో జతకలిసిన జైస్వాల్.. దూకుడును కొనసాగించాడు. కానీ గ్రీన్ 10వ ఓవర్లో జైస్వాల్.. దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇవ్వగా 11వ ఓవర్లో కర్ణ్ శర్మ వేసిన వైడ్ బంతిని ముందుకొచ్చి ఆడబోయిన శాంసన్ స్టంపౌట్ అయ్యాడు. బౌండరీ లైన్ నుంచి కోహ్లీ వేసిన సూపర్ త్రో తో జురెల్ (8) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బెంగళూరు బౌలర్లు కాస్త ఒత్తిడి తెచ్చినా పరాగ్, షిమ్రన్ హెట్మెయర్(26) ఆర్సీబీకి ఆ అవకాశమివ్వలేదు. గ్రీన్ 16వ ఓవర్లో ఈ ఇద్దరూ 17 పరుగులు పిండుకుని రాజస్థాన్‌ను విజయానికి దగ్గర చేశారు. రాయల్స్ గెలుపునకు 16 పరుగుల దూరంలో సిరాజ్ 18వ ఓవర్లో పరాగ్, హెట్మెయర్ ఔట్ అవడంతో రాజస్థాన్ శిబిరంలో ఉత్కంఠ రేగింది. కానీ రోవ్‌మన్ పావెల్ (16 నాటౌట్) ఫెర్గూసన్ 19వ ఓవర్లో 14 పరుగులు రాబట్టి ఆ జట్టును క్వాలిపయర్-2కు చేర్చాడు.
బెంగళూరు: 20 ఓవర్లలో 172/8 (పాటిదార్ 34, కోహ్లీ 33, అవేశ్ 3/44, అశ్విన్ 2/19).
రాజస్థాన్: 19 ఓవర్లలో 174/6 (జైస్వాల్ 45, పరాగ్ 36, సిరాజ్ 2/33, కర్ణ్ 1/19)