Rajasthan Royals : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తోంది. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) కొనసాగింపుపై ప్రతిష్ఠంభనతో మొదలు.. కోచింగ్, సహాయక సిబ్బందిపై వేటకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వైదొలగగా.. సీఈఓ జేక్ లస్ మెక్క్రమ్ను తప్పించింది ఫ్రాంచైజీ. ఇప్పుడు సపోర్టింగ్ స్టాఫ్‌లోని ఇద్దరిపై వేటు వేయనుంది రాజస్థాన్ యాజమాన్యం.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం పద్దెనిమిదో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రదర్శన పట్ల ఫ్రాంచైజీ అంసతృప్తితో ఉంది. 14 మ్యాచుల్లే కేవలం నాలుగంటే నాలుగు విజయాలకే పరిమితం కావడంతో ఆగ్రహించిన యాజమాన్యం.. కోచింగ్ సిబ్బందిలో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రధాన కోచ్ ద్రవిడ్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని చూడగా.. అతడు వద్దు నేను కొనసాగలేనంటూ షాకిచ్చాడు.
🚨The purge continues at Rajasthan Royals🚨
The franchise has now parted ways with spin-bowling coach Sairaj Bahutule and fielding coach Dishant Yagnik#RajasthanRoyals #IPL pic.twitter.com/ouESP3WfpM
— Cricbuzz (@cricbuzz) October 3, 2025
దాంతో.. సహాయక సిబ్బందిని మార్చడంపై దృష్టిసారించిన ఫ్రాంచైజీ స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహతులే (Sairaj Bahutule), ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్ (Dishant Yagnik)ల సేవలకు మంగళం పాడనుంది. వచ్చే సీజన్‌కు ఈ ఇద్దరిని కొనసాగించడం ఇష్టంలేక త్వరలోనే గుడ్ బై చెప్పనుంది.
మళ్లీ కోచ్‌గా కుమార సంగక్కర (Kumar Sangakkara) వస్తున్న నేపథ్యంలో పాతవాళ్లను పక్కనపెట్టేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సంగక్కర తన సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడట. అందుకే.. అతడికి టీమ్ ఎంపికలో ఏ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది రాజస్థాన్. అయితే.. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశముంది. గతంలో సంగక్కరతో కలిసి పనిచేసిన ట్రెవొర్ పెన్నెరీ తిరిగి జట్టుతో కలుస్తాడని టాక్.
వచ్చే సీజన్ కోసం తనను అట్టిపెట్టుకోవద్దని శాంసన్ కోరినందున అతడిపై ఫ్రాంచైజీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేది తెలియాల్సి ఉంది. సంగక్కరతో మంచి సాన్నిహిత్యం ఉన్నందున సంజూ మరొక సీజన్ కొనసాగే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై రాజస్థాన్ యాజమాన్యం మాత్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.