గౌహతి: ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ స్టాండ్ ఇన్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag)కు.. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ ఫైన్ వేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 182 రన్స్ చేసింది. అయితే భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై ఛేజింగ్ చేస్తున్న సమయంలో.. ఆర్ఆర్ జట్టు తమ ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నది.
ఈ యేడాది ఐపీఎల్లో ఆర్ఆర్ జట్టు తొలి ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఓవర్ రేట్ స్లోగా ఉన్న కారణంగా, కెప్టెన్ పరాగ్‌కు 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ తన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 5వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో ఆడనున్నది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నితీశ్ రాణా (36 బంతుల్లో 81, 10 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (2/28), పతిరాన (2/28), ఖలీల్ అహ్మద్ (2/38) రాజస్థాన్‌ను కట్టడి చేశారు.
అనంతరం ఛేదనలో చెన్నై.. 20 ఓవర్లలో 176/6 వద్దే ఆగిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63, 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. హసరంగ (4/35) కీలక వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్ (1/13) కట్టుదిట్టంగా బంతులేసి చెన్నైని ఆరంభంలోనే దెబ్బకొట్టాడు.